స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషతో అగ్రరాజ్యం అమెరికా మారుమ్రోగింది. అయ్యప్పస్వామి దీక్ష కేవలం తెలుగు రాష్ట్రాలకు దక్షిణాదికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది అయ్యప్ప నామస్మరణ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అందునా తెలుగువాళ్లు అయ్యప్పస్వామి దీక్షను అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు. దాంతో అమెరికాలో కూడా మన తెలుగువాళ్లు అత్యధికులు ఉండటంతో వాళ్లలో కూడా కొంతమంది ఈ అయ్యప్పస్వామి దీక్ష చేపట్టారు.
అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో అయ్యప్పమాల ధరించిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వారంతా మేరీ ల్యాండ్ లోని శ్రీ శివ విష్ణు టెంపుల్ లోని అయ్యప్పస్వామిని దర్శించుకొని దీక్ష విరమించారు. ఎడిసన్ లోని సాయి దత్త పీఠంలో శంకరమంచి రఘు శర్మ నేతృత్వంలో అయ్యప్పస్వాములు ఇరుముడి కట్టుకొని ఆ ఆలయం లోని సమస్త దేవతలను దర్శించుకొని మేరీల్యాండ్ కు బయలుదేరుతారు. సౌత్ జెర్సీ లోని వినాయక టెంపుల్ ను దర్శించుకొని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకొని మహాలక్ష్మి గుడికి చేరుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప నామ జపం చేస్తూ , భజనలు చేస్తూ …… స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషతో మేరీల్యాండ్ లోని మురుగన్ , ఆంజనేయస్వామి, సాయిబాబా, శివుడు, మహావిష్ణువు తదితర దేవుళ్లను దర్శించుకుని చివరకు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పస్వామికి ఇరుముడి అందించి ” సర్వకాల సర్వావస్థల్లోనూ కాపాడే దేవుడవయ్యా ” అంటూ భక్తితో ఆరాధిస్తారు…… ఆశీర్వాదం అందుకుంటారు. అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయ్యప్ప మాల ధరించడం , దీక్ష కొనసాగించడం కష్టతరమైన అంశమనే చెప్పాలి. ఎందుకంటే గత వారం , పది రోజులుగా మంచు తుఫాన్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.
అయినప్పటికీ …… ఆ కఠిన పరిస్థితులను చూసి భయపడకుండా అడుగు ముందుకే వేశారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప శరణుఘోషతో దిక్కులు పిక్కటిల్లేలా భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. UBlood ఫౌండర్ , JSW & Jaiswaraajya.tv సంస్థల అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలితో పాటుగా వేలాది మంది అయ్యప్పమాల ధరించారు. సాయి దత్త పీఠం నుండి శంకరమంచి రఘు శర్మ నేతృత్వంలో మేరీల్యాండ్ కు చేరుకొని దీక్ష విరమించారు. అమెరికాలో…… ఏడాదిలో రెండుసార్లు అయ్యప్పస్వామి మాలను ధరించడం …….. అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామి దీక్ష చేయడం విశేషం అనే చెప్పాలి.
ఫోటోలు: డాక్టర్ శివకుమార్ ఆనంద్.