Vangaveeti Ranga Daughter :
తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో వంగా వీటి రంగా అంటే తెలియనివారుండరు. వంటగవీటి మరణించి ఇన్నేళ్లయినా, ఇంకా ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు వినిపించడం మానలేదు. ఆయనపై ఉన్న అభిమానం అలాంటిది. ఇప్పటికే ఆయన వారసుడిగా వంగవీటి రాధ రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు పెద్ద అభిమానగణం ఉంది. విజయవాడ రాజకీయాల్లో ఆ కుటుంబం క్రియాశీలక పాత్ర పోషిస్తుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వంగవీటి అంటే దేవుడిలా ఆరాధించే అభిమానులు ఉన్నారు.
వంగవీటి రంగా హత్య తర్వాత ఆయన భార్య రత్నకుమారి, ఆ తర్వాత కుమారుడు రాధా రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ రాజకీయాల్లో రాణించలేకపోయారు. వంగవీటి రాధా ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నా ఆయన అంత పట్టు సాధించలేకపోయారు. బెజవాడలో వంగవీటి రంగాకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కాపు సామాజిక వర్గం మొత్తం రంగాను ఎంతో ఆరాధిస్తుంటారు. అయినా రాధా పట్టుసాధించలేకపోయారు. అయితే తాజాగా వంగవీటి రంగ కూతురు ఆశాలత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఆమె ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. అయితే దీనిపై స్థానిక నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. రంగా వారసురాలిగా ఆమెకు కచ్చితంగా ప్రజల నుంచి మద్దతు దక్కుతుందని చర్చ సాగుతున్నది.
వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయ ఎంట్రీ అనే అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఆమె బెజవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. 2024 ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించాలని మేనమామ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. రంగా రాజకీయ వారసత్వాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. అయితే ఆశాలత పోటీ చేస్తానంటే సీటు ఇచ్చేందుకు ఆయా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. వంగవీటి రంగా బిడ్డగా ఆమెకు ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లోనూ మరింత బలం చేకూరుతుందని ఆయా పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.