Varanasi Cricket Stadium : క్రికెట్ ను అభిమానించే దేశాల్లో మనదేశం ముందుంటుంది. జాతీయ సమైక్యత మన దేశంలో క్రికెట్ లోనే ఉందంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే టీవీలకు అతుక్కుపోవడం మనకున్న నైజం. దీంతో క్రికెట్ ను దేవుడిగా చూడటం మామూలే. క్రికెటర్లకు కూడా అభిమానులుంటారు. క్రికెట్ కు ఆరాధ్యుడిగా సచిన్ టెండుల్కర్ ను చెబుతారు. సచిన్ అంటే ఇష్టపడని వారుండరంటే ఆశ్చర్యం కలగక మానదు.
క్రికెట్ ను స్టేడియాల్లోనే ఆడతారు. ఒక్కో స్టేడియం ఒక్కో క్రీడాకారుడికి అచ్చొస్తుంది. ఆ స్టేడియంలో అతడి ప్రతిభ మొత్తం చూపించి జట్టు విజయానికి బాటలు వేయడం కామన్. ముంబైలోని వాంఖడే, కోల్ కతాలో ఈడెన్ గార్డెన్, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ, మొహాలీ, చెన్నైలని చెపాక్, బెంగుళూరులో చిన్నస్వామి, హైదరాబాద్ లోని ఉప్పల్, అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియాలు మనకు తెలిసినవే.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ. 450 కోట్లతో దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అధునాతన సదుపాయాలతో కొత్త హంగులు సమకూర్చనున్నారు. ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టేడియంలో 33 వేల మంది ప్రేక్షకులు కూర్చునేందుకు రూపకల్పన చేయనున్నారు. ఇది శివుడి థీమ్ తో నిర్మాణం అవుతుందని చెబుతున్నారు. ఢమరుకం షేపులో ఎంట్రెన్స్, త్రిశూలం లాంటి ఫ్లడ్ లైట్లు పోల్స్ ఉండనున్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీని గురించి పలు కోణాల్లో కామెంట్లు వస్తున్నాయి. క్రికెట్ స్టేడియం తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.