Vemulawada Assembly Review : అసెంబ్లీ నియోజకవర్గం : వేములవాడ
బీఆర్ఎస్ : చెన్నమనేని రమేశ్ బాబు
బీజేపీ : చెన్నమనేని వికాస్
కాంగ్రెస్ : ఆది శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ పాలిటిక్స్ జరిగే అవకాశమున్న అసెంబ్లీ సెగ్మెంట్ వేములవాడ. ఇక్కడ ఇద్దరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకరు చెన్నమనేని రాజేశ్వర్ రావు రెండో వ్యక్తి ఆయన రాజకీయ వారసుడు రమేశ్ బాబు. గతంలో సిరిసిల్ల రాజకీయాలను శాసించిన వీరు తర్వాత వేములవాడ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? బండి సంజయ్ కాకపోతే.. బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు? కాంగ్రెస్ తో పాటు విపక్షాల నుంచి టికెట్ రేసులో ఉన్నది ఎవరు. ఈ సారి ఎన్నికల్లో.. టెంపుల్ సిటీ గురించి తెలుసుకుందాం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగా కూడా వార్తల్లో నిలుస్తుంది. దీనికి కారణం చెన్నమనేని కుటుంబమే. ఎవరు నెగ్గినా, ఎవరు ఓడినా ఈ ప్రాంతం వారి కనుసన్నల్లోనే ఉంటుంది. గెలిస్తే ఎమ్మెల్యే.. ఒకవేళ ఓడిపోతే వీరి మద్దతు ఉన్నవారే ఎమ్మెల్యేగా అధికారం చేపట్టేది.
వేములవాడ సెగ్మెంట్ సిరిసిల్లలో భాగంగా ఉన్న సమయంలో 1967 ఎన్నికల్లో ఆ సీటు నుంచి సీపీఐ పార్టీ జెండాపై గెలుపొందారు చెన్నమనేని రాజేశ్వర్ రావు. 2004 వరకు ఓడుతూ, గెలుస్తూ వచ్చారు. అయితే గతంలో సీపీఐ నుంచి పోటీ చేసిన ఆయన 2004లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇదే ఆయనకు చివరి ఎన్నికలు అయ్యాయి. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా చెన్నమనేని రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఎంట్రీ సమయానికి సిరిసిల్ల నుంచి వేములవాడ వేరై సపరేట్ సెగ్మెంట్ గా ఆవిర్భవించింది. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన రమేశ్ గెలుపొందారు. ఇక 2010లో తెలంగాణ మూమెంట్ స్ట్రాట్ కావడంతో టీడీపీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. 2014, 2018లో కూడా ఆయననే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సిరిసిల్లలో కలిసి ఉన్న సమయం, విడిపోయిన తర్వాత వేములవాడకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు చెన్నమనేని రాజేశ్వర్ రావు, 4 సార్లు చెన్నమనేని రమేశ్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి 2 సార్లు మాత్రమే ఎస్సీకి రిజర్వు కాగా.. 13 సార్లు జనరల్ కేటగిరీలోనే పోటీ జరిగింది. అయితే చెన్నమనేని కుటుంబం లేకుండా ఇక్కడ రాజకీయాలు లేవు.
వేములవాడ పరిధిలో 6 మండలాలు ఉన్నాయి. కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, మేడిపల్లి, వేములవాడ, కథలాపూర్. వీటి పరిధిలో.. దాదాపు 2 లక్షల 8 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ ఓటర్లు. బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ గెలుపును నిర్ణయించేది కేవలం 4 సామాజికవర్గాల ఓటర్లే కావడం విశేషం.
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఈ సెగ్మెంట్ లో చెన్నమనేని కుటుంబమే ఆధిపత్య వహిస్తుంది. ఈ సారి కూడా 2023లో బీఆర్ఎస్ తరుఫునుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. పైగా సిట్టింగులకే ఛాన్స్ అన్న కేసీఆర్ మాట కూడా ఆయనకు కలిసి వస్తుంది. వివాద రహితుడిగా గుర్తింపు ఉన్నా.. పౌరసత్వ వివాదం మాత్రం ఇప్పటికీ ఉంది. 2009 నుంచి ఈ వివాదం ఆయనకు సవాల్ గా నిలుస్తుంది. గతంలో ప్రత్యర్థి పార్టీలు దీనిపై రాద్దాంతం చేయగా.. ఇప్పుడు సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెల్లలో జరగబోయే ఎన్నికల్లో రమేశ్ బాబుకు టికెట్ వస్తుందా? రాదా? అన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా వినిపిస్తుంది. ఒకవేళ రమేశ్ బాబుకు టికెట్ దక్కకకపోతే.. చల్మెడ మెడికల్ కాలేజీల ఎండీ లక్ష్మీ నరసింహరావు బరిలో నిలుస్తారని చర్చ సాగుతోంది. ఈ సారి టికెట్ ఇస్తామన్న హామీతోనే ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా.. బరిలో దిగేందుకు సిద్ధమైనట్లే కన్పిస్తున్నారు.
గతంతో పోలిస్తే బీజేపీ ఇక్కడ కొంత పుంజుకుంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు రాజకీయ వారసుడిగా.. ఆయన కొడుకు వికాస్ బీజేపీ నుంచి వేములవాడ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి బండి సంజయ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈయనతో పాటు మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా ఇదే టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో బీజేపీ తరఫున బరిలో దిగేది ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఈ రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఇప్పటి వరకు వరుసగా ఓడుతున్న ఆది శ్రీనివాస్ మరోసారి తన గెలుపును పరీక్షించుకోవాలనుకున్నారు. ఓటమి పాలవుతున్నా నిత్యం ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఇది ఆయనకు కొంచెం ప్లస్ కానుంది. ఇక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ సారి వేములవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. పొన్నం ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆది ఓటు బ్యాంకును ఎటువైపు మళ్లిస్తారో? అని ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
కొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉన్నా.. ప్రధాన పోరు మాత్రం బహుముఖమనే చెప్పవచ్చు. టికెట్ దక్కని వారు రెబల్స్ గా మారితే ప్రధాన పార్టీలకు చిక్కులు మాత్రం తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి రెబల్ గా బరిలోకి దిగిన రేగులపాటి పాపారావు, సీపీఐఎంఎల్ తరఫున ఎన్వీ కృష్ణయ్య ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించారు.