- విజయసాయి, వైవీ మధ్య విభేదాలు

Visakha YCP :ఎన్నికలకు ఏడాది ఉండగా, వైసీపీని వివాదాలు చుట్టు ముడుతున్నాయి. పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొందరు బహిరంగంగానే ఘర్షణకు దిగుతున్నారు. పార్టీని సమన్వయం చేయాల్సిన నాయకులు కూడా ఏం తక్కువ తినలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా పార్టీ అధినేత, సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. పార్టీ మీటింగుల్లో పదే పదే కలిసి పనిచేయాలని చెప్పిన సూత్రం ఆయా నాయకులు పట్టించుకోకపోవడం ఆయన సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తున్నది
విశాఖ కేంద్రంగా రచ్చ..
విశాఖలో విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు పెడచూపుతున్నాయి. గతంలో పార్టీ ఇన్చార్జిగా ఉన్న విజయసాయి అన్ని తానై నడిపించారు. విశాఖ రాజకీయాలన్నీ తన భుజాలపై వేసుకొని నడిపించారు. కొంతకాలం ఆయనను అధినేత జగన్ ఆ బాధ్యతల నుంచి తొలగించారు. వైవీ సుబ్బారెడ్డి కి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇదే వివాదాలకు కేంద్ర బిందువైంది. విజయసాయి వేసిన కమిటీలను తొలగించారు. అయితే ఇటీవల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడి హోదా రావడంతో మరోసారి విజయసాయి రెడ్డి కీలకమయ్యారు. తన అనుచరులకు మరోసారి పదవులు కట్టబెట్టారు. ఇదే ఇప్పుడు వైవీ, విజయసాయి ల మధ్య వివాదాలకు దారి తీసింది.
విజయసాయికి కష్టకాలమేనా..?
వైసీపీలో నంబర్ 2గా వెలుగువెలిగిన విజయసాయి కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. కీలక సమయంలో ఆయన ఢిల్లీకి పరిమితమయ్యారు. ఇటీవల ఆయనకు మరదలు కూతురైన ఆలేఖ్య భర్త తారకరత్న చనిపోవడంతో, అన్ని తానై అక్కడి తంతు పూర్తి చేశారు. అదే సమయంలో చంద్రబాబుతో మాట్లాడుతూ కనిపించారు. దీనిపై పెద్ద టాకే బయటకు వచ్చింది. అయితే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడి హోదా కల్పించిన ఆయన ఎక్కడా పార్టీ అధినేత ధన్యవాదాలు చెప్పినట్లు కనిపించలేదు. పార్టీ తనను అవమానించిందనే ధోరణిలో ఆయన ఉన్నట్లు తెలిసింది. బాలినేని వ్యవహారం తర్వాత విజయ సాయిని దగ్గరకు తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. ఏదేమైనా విజయసాయి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీ అధినేతతో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండడం బహిరంగంగానే కనిపిస్తున్నది.