
Visit to America : భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ యువనేత, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ స్వల్ప వ్యవధిలో అమెరికాలో పర్యటించారు. ఇద్దరూ తమ తమ షెడ్యూల్ కు అనుగుణంగా టూర్ ను కొనసాగించారు. ఇండియా నుంచి ఒకే సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు ఇలా యూఎస్ లో పర్యటించి, అక్కడి భారతీయులతో మాట్లాడారు. కానీ ఇక్కడ ఇద్దరు నేతల ప్రసంగాల్లో ఎంతో తేడా కనిపించింది. అధికార హోదాలో దేశాన్ని ఓన్ చేసుకుంటూ మోదీ ప్రసంగాలు కొనసాగితే, రాహుల్ ప్రసంగాలు మాత్రం మోదీ వైఫల్యాలను ఎండగట్టడం వరకే సరిపోయింది.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జెల్లి బైడెన్ సహా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. అయితే న్యూయార్క్, వాషింగ్టన్లలో కొనసాగిన ఆయన పర్యటనల్లో పలు సమావేశాలు, సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలు, ఆర్థిక ప్రగతి, ద్వైపాక్షిక సంబంధాలు, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై మాట్లాడారు. భారత్ కయ్యానికి కాలు దువ్వుతున్న వారికి ఇదే వేదిక నుంచి హెచ్చరికలు జారీ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో భారత వైఖరిని కూడా చెప్పుకొచ్చారు. అయితే అన్ని ప్రాంతాల్లో మోదీ ప్రసంగం ఒక జవాబుదారీతనంతో కొనసాగింది. భారత్ ను అన్ని రంగాల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని చెప్పారు. అయితే మోదీ ప్రసంగాలు మొత్తం పాజిటివ్ కోణంలో సాగాయి.
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ యువనేత అమెరికాలో పర్యటించి, భారత్ లో ప్రస్తుత పరిస్థితులు, మోదీ వైఖరిపై విమర్శలకే పరిమితమయ్యారు. మోదీ పాలనలో భారత్ వెనక్కి వెళ్తున్నదని, ప్రగతి లేదని చెప్పుకొచ్చారు. విదేశీ గడ్డపై భారత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ప్రసంగాలు కొనసాగాయి. అయితే ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నది. ప్రతిపక్ష నేత విదేశీ గడ్డపై ఇలా మాట్లాడడం సరికాదని, మన దేశంలో రాజకీయ పరంగా విభేదాలు ఉన్నా, అమెరికాలో మన దేశ ప్రగతిని కించ పర్చేలా మాట్లాడడం సరికాదని హితవుపలుకుతున్నారు. ఏదేమైనా ప్రధాని హోదాలో భారత ప్రతినిధిగా మోదీ, రాజకీయ పార్టీ నాయకుడి హోదాలో రాహుల్ గాంధీ పర్యటన అమెరికాలో కొనసాగింది.