
Vizag steel workers : విశాఖలో వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. ఎండతోనే కాదు.. విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనతో కూడా. కర్మాగారం కార్మికులు మంగళవారం కదం తొక్కారు. కంపెనీ ఆఫీస్ ను చుట్టుముట్టారు. వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు.
అసలేమైందంటే..
విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు (Vizag steel Workers) మంగళవారం ఆందోళనకు దిగారు. సెయిల్ తరహాలో తమకు వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వీరంతా ఆందోళనకు దిగారు. బైఠాయింపుతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు. ఆరేండ్లుగా వేజ్ బోర్డును అమలు చేయడం లేదని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ర్యాలీగా కార్యాలయం వద్దకు చేరుకొని ముట్టడించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని మండిపడ్డారు.
ఆత్మస్థైర్యాన్ని నాశనం చేస్తున్నారని బాధ్యతారాయుతంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని చల్లబర్చేందుకే జీతభత్యాలపై తమను దెబ్బ కొడుతున్నారని కార్మికులు మండిపడ్డారు. రా మెటీరియల్ ఇవ్వకుండా నష్టాలు చూపించి, ప్లాంట్ ను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమ ప్లాంట్ ను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇది ఆంధ్ర ప్రజల హక్కని, ప్లాంట్ ను కాపాడేందుకు సీఎం జగన్ ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సీఎంగా ఉండి చూడనట్లు పట్టనట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా లేదు.. విశాఖ రైల్వే జోన్ లేదు,. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా మూసివేస్తే విశాఖ గొప్పేముంటుందని ప్రశ్నించారు. అయితే కార్మికులు శాంతియుతంగా నిరసనకు దిగగా, పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.