Vote From Home : భారత ఎన్నికల సంఘం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 80 ఏళ్ల వయసు దాటిన వారికి ఓ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా అధికారులే వారి ఇంటికి వెళ్లి వారి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తలు చేపడుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నమూనాగా ప్రారంభించిన ఈ పథకం సత్ఫలితాలివ్వడంతో భవిష్యత్ లో దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ పై ఓటు వేసేందుకు ఉత్తర్వులు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపడంతో ఇక వచ్చే ఎన్నికల్లో ఈ మేరకు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఉపశమనం కలగనుంది.
80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే ఇంటి నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి నుంచి ఓటు వేసే వారి కోసం ప్రత్యేక రంగులో పోస్టల్ బ్యాలెట్ రూపొందించనున్నారు. ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు విధి విధానాలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపనుంది.
ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అధికారులు ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో, కర్ణాటక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు మన రాష్ట్రంలో 4,87,950 మంది ఉన్నారు. వీరికి వచ్చే ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు.