సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ ఇద్దరూ 80 వ దశకం నుండి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. పైగా ఇద్దరు కూడా ఊర మాస్ హీరోలు కావడంతో ఇక అభిమానులు కూడా సై అంటే డబుల్ సై అంటూ యుద్ధానికి అప్పటి నుండి కాలు దువ్వేవాళ్ళు. కట్ చేస్తే నాలుగు దశాబ్దాల తర్వాత కూడా చిరంజీవి – బాలకృష్ణ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం విశేషం. 60 ప్లస్ లో కూడా తెలుగునాట సత్తా చాటుతున్నారు ఈ ఇద్దరు హీరోలు.
ఇక తాజా వివాదానికి వస్తే …….. చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే చిత్రం చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇటీవలే బాస్ మాస్ పార్టీ అంటూ ఓ పాటను విడుదల చేసారు. బాక్స్ బద్దలయ్యే పాట అంటూ దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేసాడు. ఇది మాస్ ప్రేక్షకులను అలరించేలానే ఉంది. అయితే బాక్స్ లు బద్దలయ్యే పాట మాత్రం కాదు దాంతో మెగా ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంగానే ఉన్నారు. కట్ చేస్తే సరిగ్గా ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి చిత్రంలోంచి జై బాలయ్య అనే పాట విడుదల చేశారు. ఈ పాట మాస్ ను అలాగే నందమూరి అభిమానులను విశేషాంగా అలరిస్తోంది. అంతేకాదు పాటలో చేసిన పద ప్రయోగం కూడా బాలయ్య ను ఆకాశానికి ఎత్తేలా ఉంది. దాంతో బాలయ్య అభిమానులు ఖుషీగా ఉన్నారు.
ఇంకేముంది ఇక్కడే మెగా – నందమూరి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ని మెగా అభిమానులు టార్గెట్ చేశారు. బాలయ్య కు అద్భుతమైన పాట ఇచ్చారు ….. ఆయన తిరుగులేని మొనగాడు అంటూ కీర్తించడం అంటే చిరంజీవిని తగ్గించడమే కదా అంటూ రామజోగయ్య శాస్త్రిని టార్గెట్ చేయడంతో చాలా హర్ట్ అయ్యాడట. అలాగే తమన్ – దేవిశ్రీప్రసాద్ లు చేసిన ట్వీట్లు కూడా మరింత వేడిని పెంచాయి.
బాస్ మాస్ పార్టీ పాటకు బాక్స్ లు బద్దలు కావాల్సిందే అని దేవి ట్వీట్ చేసాడు కానీ ఆ పాట అంతగా పేలలేదు. కానీ జై బాలయ్య సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో బాక్స్ బద్దలై పోయింది అంటూ తమన్ చేసిన ట్వీట్ మరింత మంట పెడుతోంది. దేవిశ్రీప్రసాద్ కు తమన్ చురకలు అంటించాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో చిరంజీవి – బాలకృష్ణ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. విశేషం ఏమిటంటే ….. అటు వాల్తేరు వీరయ్య ఇటు వీర సింహా రెడ్డి రెండు కూడా 2023 సంక్రాంతి కి విడుదల కానున్నాయి. మరి అప్పుడు ఇంకెంత గొడవ గొడవగా ఉంటుందో.