
CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పోరాడేందుకు దుష్ట చతుష్టయం ఏకమవుతున్నదని పేర్కొన్నారు. ఇది కులాల మధ్య యుద్ధం కాదని పేదవాడు ఒకవైపు, పెత్తందారులు మరోవైపు కురుక్షేత్ర యుద్ధం సాగుతున్నదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనను మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. మీడియా, ప్రతిపక్షాలు కలిసి తనపై యుద్ధం ప్రకటించాయని , తాను ఒంటరిగా వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నానని ప్రకటించారు.
ప్రతిపక్షాలపై విమర్శలు..
అయితే ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేనాని పవన్ లక్ష్యంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దొంగల ముఠాగా అభివర్ణించారు. కొవ్వూరు లో విద్యా దీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిభ చూపించే ప్రతి విద్యార్థికి అండగా ఉంటానని హామీని ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు అన్న రంగాల్లో రాణించాలని సూచించారు.
అయితే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. అదే రాష్ట్రం అదే బడ్జెట్ తో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు బటన్ నొక్కి మూడు లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. వారికి లాగా తనకు మీడియా, దత్తపుత్రుడి మద్దతు లేదని తెలిపారు. ఇకపై మీరే జగనన్నకు సైనికులు కండంటూ అభ్యర్థించారు. తన బలం ప్రజలేనని అందరి జీవితం చల్లని దీవెనలు నాపై ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం లో తనకు అశీస్సులు అందించాలని కోరారు.