- ఉద్యోగులు ‘సంఘ’ టితమై డిమాండ్లను సాధిస్తాం
NTR District JAC : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక ప్రయోజనాలు సాధించేంతవరకు ఉద్యోగుల శాంతియుత ఆందోళన కొనసాగుతుందని డిమాండ్ల సాధనకు ఉద్యోగులు మరో సారి సంఘటితం కానున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ అన్నారు. రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు నిరసనలో భాగంగా జిల్లా ఐ .కా .సా బృందం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి నాగలక్ష్మి కి వినతి పత్రాన్ని అందజేసి జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు ను నిరసన కార్యక్రమం గురించి వివరించారు
అనంతరం మీడియా ప్రతి నిధులతో విద్యా సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచిన ప్రతిసారి కేవలం మాటలే తప్ప ఒక్క సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరించలేదన్నారు. తాజాగా మంత్రుల బృందంతో జరిగిన సమావేశంలో కూడా బృందంలోని మంత్రులు కొత్త వాయిదాలు కోరారే గాని పాత వాయిదాల గురించి ప్రస్తావన లేకుండా మాట్లాడటం వల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర జేఏసీ ప్రకటించిన ఆందోళన కార్యక్రమాల్లో ఉద్యోగులందరూ పాల్గొంటున్నారన్నారు.
తామ ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బులకు కూడా గ్యారెంటీ లేకుండా పోయిందని అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొన్నారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైన మానసిక ఆవేదనకు గురిచేస్తోందన్నారు. మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలకు అంకితమైన ఉద్యోగి తన విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్.ఎం ఆర్, రోజువారి పద్ధతిలో పనిచేస్తున్న మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రతి ఉద్యోగికి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలు ఉన్నాయన్నారు. 12వ పీ ఆర్ సి కమీషన్ వేసినప్పటికీ నేటికీ ఏ మాత్రం ప్రగతి లేదు. సంఘాలతో చర్చించి, జిల్లాల పర్యటనలు, ఉద్యోగుల నుండి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ను సమర్పించేందుకు చాలా గడువు కావాల్సి ఉంటుందన్నారు. 01.07.2023 నుండి 12వ పి ఆర్ సి అమలు కావలసి ఉందన్నారు. కానీ ఇప్పటివరకు పిఆర్సి కమిషన్ పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రకటించకపోవడం విచారకరమన్నారు.
నిత్యవసర వస్తువుల ధరలు హెచ్చు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి (ఐ.ఆర్) 30% ప్రకటించాలన్నారు. ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత అనేక సమస్యలు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయని గుర్తు చేశారు. తక్షణమే ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ నెలలు గడుస్తున్న ఒక్కరికి రావడం లేదన్నారు. ఉద్యోగులు తమ సొంత డబ్బును చందాగా కడుతూ పి.యఫ్, ఏపి జి యల్ ఐ లోన్స్, పార్ట్ ఫైనల్స్ దరఖాస్తు చేసుకున్నా నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రీయంబర్స్మెంట్, వంటి అత్యవసర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
గురువారం నాటి ఆందోళనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల లో ఉద్యోగులు పెద్ద యెత్తున నల్ల బాడ్జీలు ధరించి విధులకు హాజరైరయ్యారని తాలూకా కేంద్రాలు నిరసన ప్రదర్శనలు చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జేఏసీ కార్యదర్శి, ఎండి ఇక్బాల్, రాష్ట్ర జెఎసి నాయకులు, హరినాథ్ బాబు, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్ నాయకులు, రవీంద్రబాబు, ఎస్ టి యు. నాయకులు కిషోర్, శ్రీనివాసరావు, పబ్లిక్ సెక్టార్ నాయకులు సాంబశివరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సాయిరాం, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు జానీభాష, ఉపాధ్యాయ సంఘ నాయకులు రెడ్డమ్మ, విజయవాడ నగర శాఖ నాయకులు శ్రీరామ్, సంపత్ కుమార్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు జి. నారాయణరావు, విష్ణువర్ధన్ రావు తదితరులతో సహా పి. రమేష్, సతీష్ కుమార్, బీవీ రమణ, రాజబాబు, నజీర్, సిహెచ్ ప్రసాద్, మధుసూదన్ తదితరులతోపాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు మండల, తాలూకా స్థాయి నాయకులతో పాల్గొన్నారు.