West Bengal Couple :
రాను రాను మానవత్వం మరీ మంట కలుస్తోంది. ఒక యువ జంట చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సోషల్ మీడియా పుణ్యమా ఇంకెన్ని నిర్వాహకాలు చూస్తామో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతగల తల్లిదండ్రులమని మరిచారా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఏం చేశారు? ఇక్కడ తెలుసుకుందాం.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ యువ జంట సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారు. అయితే, రీల్స్ మరింత బాగా చేసేందుకు ఐఫోన్ కొనాలనుకున్నారు. కానీ వారి వద్ద డబ్బు లేదు. తమ 8 నెలల చిన్నారిని అమ్ముకున్నారు. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వీరు తల్లిదండ్రులేనా? అంటూ నిలదీశారు. పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరిగణాల్లో జదేవ్-సత్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఒక కుమార్తెకు 7 సంవత్సరాలు, మరో కుమార్తెకు 8 నెలలు.
సోషల్ మీడియా కోసం రీల్స్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఖరీదైన ఫోన్ కొనుగోలు చేశారు. వారు రీల్స్ తీస్తున్న క్రమంలో ఇరుగు పొరుగు వారికి తన 8 నెలల చిన్నారి కనిపించడం లేదు. దీంతో వారికి అనుమానం వచ్చి దంపతులను విచారించగా వారు తమ చిన్నారికి అమ్ముకున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలించారు. ఆ చిన్నారిని ఖర్దాలో ఒక మహిళ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తల్లి సత్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా.. తండ్రి జయదేవ్ మాత్రం పరారీలో ఉన్నాడు. బిడ్డను అమ్మడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగంపై ఈ జంట ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే వారు చిన్నారిని పేదరికం కారణంగా విక్రయించారా..? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.