
క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ లేని వరల్డ్ కప్ చూడగలమా.. నిజంగా అదే జరుగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్ లో వెస్టిండీస్ కు చోటు లేదు. నిజమేనని అనుకోక తప్పదు. ప్రపంచ క్రికెట్ ను ఒకప్పుడు శాసించిన వెస్టిండిస్ ఇప్పుడు చిన్న దేశాల చేతుల్లో ఓడిపోయి.. కనీసం వరల్డ్ కప్ కు క్వాలిపై కాలేకపోయింది. ఈ ఏడాది చివరిలో భారత్ లో ప్రపంచకప్ జరగనుంది. ఇందులో వెస్టిండీస్ జట్టు లేదు.
ప్రపంచకప్ లో పది జట్లకు చోటు ఉంటుంది. ఇందులో ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జట్లకు చోటు ఉంటుంది.. క్వాలిఫయర్ల ద్వారా రెండు జట్లు టోర్నీలోకి ఎంట్రీ ఇస్తాయి. పేలవమైన ప్రదర్శనతో ర్యాంకుల్లో వెనుకబడగా.. క్వాలిఫయిర్ పోటీ ల్లో నూ ఓడిపోయింది.. క్రికెట్లో వెస్టిండీస్ అంటే ఓ చరిత్ర. ఇప్పుడు దాని తలరాత మారింది. అయితే ఇదంతా గతం అని చెప్పుకునేలా దిగజారింది.ఎంత ఎత్తుకు ఎదిగిందో అంతే వేగంగా కిందకు పడిపోయింది.
1975, 79 వరల్డ్ కప్ గెలిచాక తిరుగులేని స్థానంలో ఉన్న వెస్టిండీస్. 1983లో జరిగిన వరల్డ్ కప్ లో విండీస్ ఫైనల్ లో టీమిండియా చేతిలో చిత్తయ్యింది.
వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి విండీస్ లేకుండా టోర్నమెంట్ జరగనుంది. వరుస ఓటములతో ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రేసు నుంచి వెస్టిండీస్ అవుట్ అయ్యింది. ముందు టెస్టుల్లో… ఆ తర్వాత వన్డేల్లోను వెస్టిండీస్ పతనం కొనసాగింది. ఒకప్పుడు సంప్రదాయ క్రికెట్ ను ఏలిన విండీస్, ఇప్పుడు కేవలం టీ 20 ఫార్మెట్ లోనే రాణిస్తుంది. అది కూడా మునపటిలా కాదు. 2016 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ జట్టు ప్రదర్శన దారుణంగా మారింది. వెస్టిండీస్ బోర్డు కారణంగానే జట్టు ఇలా మారిపోయిందన్న విమర్శలున్నాయి. ఆటగాళ్లకు డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం అంతర్గత రాజకీయాలు.. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించకపోవడం వంటి వాటితో నిర్వీర్యం అయిపోయింది. 2016లో టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే చాన్స్ ఉన్నా… నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు విండీస్ క్రికెట్ వైభవం చరిత్రలో కలిసిపోతోంది. ఇక తర్వాత ప్రపంచ కప్ వరకైనా బలంగా వస్తుందా..లేదా చూడాలి.