TDP Surveys : ‘2024 ఎన్నికలు అత్యంత కీలకం. త్యాగాలు చేయాలి. సర్వేలతో ప్రజల్లో ఆదరణ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. తర్వాత.. ఎవరు ఏమనుకున్నా.. చేసేది మాత్రం ఏమీలేదు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తరుచూ చెప్తూనే ఉన్నారు. ఇంతకీ ఆయన చెప్పినట్టే చేశారా? అంటే ఆ జాడలు కనిపించడంలేదు. సర్వేలతో పార్టీ కేడర్ ను పరుగులు పెట్టించారు. కానీ.. మార్పులు, చేర్పుల పరంగా ఆయన చెప్పింది ఒక్కటీ జరగలేదు. గంపగుత్తగా అందరూ పాత కాపులకే పట్టం కట్టారు. వీరిలోనూ రెండు సార్లు, మూడు సార్లు ఓడిపోయిన వారు ఉండడం గమనార్హం.
ఉదాహరణలు పరిశీలిస్తే.. సర్వేపల్లి (నెల్లూరు)లో వరుసగా ఓటమి కోసమే పోటీ చేస్తున్నానా? అనిపించిన నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికి ఆయన ఐదు సార్లుగా ఓడిపోయారు. ఇక్కడ ఇప్పుడు మార్పు తథ్యమని పార్టీ కేడర్ భావించింది. కానీ, మరోసారి పార్టీ సోమిరెడ్డికే టికెట్ ఇచ్చి.. వైసీపీ గెలుపునకు బాటలు పరిచిందని కేడర్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
చింతలపూడిలో సోమా రోషన్ ను పేరు బయటకు వచ్చింది. ఇది కొత్త మొహమే. ఇక్కడ చింతలపూడిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. పీతల సుజాత తనకే టికెట్ అంటూ చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు. ఈ దఫా ఆమెకు ఇస్తే గెలుపు ఖాయమనే చర్చ జరుగుతుంది. నాలుగేళ్లలో ఇక్కడ రోషన్ చేసింది ఏమీ లేదు. పార్టీలో కానీ, నియోజకవర్గంలో కానీ ఆయన పెద్దగా ఇమేజ్ లేని నాయకుడని తెలుస్తోంది.
ఇక, విజయవాడ తూర్పును గద్దె రామ్మోహన్ కే కేటాయించారు. వాస్తవానికి ఈయన గ్రాఫ్ భారీగా పడిపోయిందని పార్టీలోనే చర్చ నడుస్తోంది. అయినా.. ఆయనకే టికెట్ ఇచ్చారు. నూజివీడులో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పక్కన పెట్టి.. పార్టీలో కూడా చేరని కొలుసు పార్థ సారధికి టికెట్ ఇచ్చారు. మరి ఏ సర్వే ఆధారంగా ఇచ్చారనేది అతిపెద్ద ప్రశ్న. మైదుకూరులో (కడప) కూడా ఇదే పరిస్థితి. వరుస పరాజయాలు తప్ప గెలుపు అంచుల వరకు కూడా రాని పుట్టా సుధాకర్ యాదవ్‌కు పట్టం కట్టారు. ఆయనకు టికెట్ ఇవ్వద్దనే డిమాండ్ రెండేళ్ల నుంచి వినిపిస్తూనే ఉంది. అయినా.. ఏ సర్వే ఆధారంగా టికెట్ ఇచ్చారో ఆయనకే తెలియాలి. ఇతమిస్థంగా చెప్పేదేంటంటే.. చంద్రబాబు సర్వేలు.. పేర్కొన్న ప్రజానాడి.. ఈ జాబితాలో కనిపించలేదు.