Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితులపై 10 వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసినందుకు ఆయనపై ఎన్‌ఐఏ చర్యలు తీసుకుంది.
అరెస్టుకు కారణాలు:
సన్నీ యాదవ్ “పాక్‌లో మొదటిరోజు” అంటూ ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోను పరిశీలించిన ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన అనంతరం భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరుతో పాక్‌పై దాడికి దిగిన సమయంలో సన్నీ యాదవ్ పాకిస్తాన్‌కు వెళ్లడం, అక్కడి వీడియోలు పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సన్నీ యాదవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయంగా చర్చలకు దారి తీశాయి. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని, వాటితో డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే ఈ వీడియోలను తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 10 వీడియోలపై ఎన్‌ఐఏ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
గత సంఘటనలు, అనుమానాలు:
హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను గతంలో పాకిస్తాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందని ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు (ISI) తమ అస్త్రంగా మలచుకున్నారని హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్‌లో ఉన్నట్లు కూడా విచారణలో తేలింది. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌లో పలుమార్లు పర్యటించారని, ఓసారి చైనాకూ కూడా వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు.
ఇదే తరహాలో బయ్యా సన్నీ యాదవ్‌కు కూడా పాక్ అధికారులతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారణ ప్రారంభించనున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో, ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.