
Revanth Reddy : ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం యావత్తు ఆశ్చర్యానికి గురైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఆయన కొడుకు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఫోన్ చేసి చంద్రబాబు యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు.
ఇటు ఇండియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డెక్కారు. చంద్రబాబు నాయుడిని రిలీజ్ చేయాలని నినదించారు. ఇప్పటి వరకు ఒక ప్రజా ప్రతినిధి కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డు ఎక్కడం కనిపించలేదు. ఇక అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఆయన అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ‘యూ బ్లడ్ యాప్’ అధినేత డా. జగదీష్ యలమంచిలి గారు జగన్, ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆయనను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ బాబు అరెస్ట్ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించడం తీవ్ర చర్చకు దారి తీసింది. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో 2009 నుంచి 2017 వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆయన టీడీపీలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పని చేశారు. ‘చంద్రబాబు అరెస్ట్ ను ఎలా చూస్తున్నారు?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు అరెస్ట్ విషయంలో రిపోర్టర్ అడిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ ‘ఎట్ల చూస్తలేం.. ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నాం. అరెస్ట్ చేసినట్లే చేస్తున్నం’. అని అన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై గతంలో మధుయాష్కీ స్పందిస్తూ.. ఇది మోడీ, కేసీఆర్ కుట్రగా అభివర్ణించారు.