AP : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. అయితే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాజెక్టుల సందర్శన పేరిట యాత్ర మొదలుపెట్టారు. రాయలసీమ నుంచి మొదలై ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తూ వస్తున్నారు.
అయితే ఉన్నట్టుండి చంద్రబాబు ఇలా ప్రాజెక్టుల సందర్శన అని ఎందుకు బయల్దేరారు. అసలు ఇప్పుడే ఎందుకు ఆయన ప్రాజెక్టులు గుర్తుకు వచ్చాయి అని అంతా చర్చ నడుస్తున్నది. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయింది. కానీ రాష్ర్టంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. మరీ ముఖ్యంగా పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. టీడీపీ హయాంలో వేగంగా పట్టిసీమ పూర్తి చేయగా, పోలవరం పనులు సవ్యంగానే సాగాయి. కానీ జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో సాగునీటి రంగ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏపీలో నెలకొంది.
అయితే ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ర్టంలో రైతాంగాన్ని కుదేలు చేసేలా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో పూర్తిగా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని మండిపడుతున్నారు. అన్ని చోట్ల పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఆయన క్యాడర్ కు సూచనలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా హోరెత్తిస్తున్నారు.