
DK Shiva Kumar background : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. పార్టీని ప్రభుత్వంలోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఇక గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కూడా తనకే ఇవ్వాలని ఆయన పట్టు బట్టారు. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య ను కాదని డీకేను సీఎం చేయాలా..? అని కాంగ్రెస్ పార్టీ తలపట్టుకుంది.
అయితే ఐదేళ్ల ప్రభుత్వంలో మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, తర్వాతి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలని అధిష్టానం సూచించడంతో వివాదం సద్దుమణిగింది. అయితే సిద్ధరామయ్య గతంలో మంత్రి పదవి నుంచి డిప్యూటీ సీఎం, సీఎం పదవులు చేపట్టారు. దీంతో ఆయన పేరు ఇతర రాష్ట్రాలకు తెలుసు, దీనికి తోడు ఆయన బలహీణ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో రాష్ట్రంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
అయితే డీకే పేరు చాలా మందికి తెలియదు. ఈ సారి కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపునకు వ్యూహాలు రచించడంతో అందరి దృష్టిలో పడ్డారు. ఇప్పుడు డీకే పేరు దేశం మొత్తం వినిపిస్తుంది. అసలు ఆయన ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చాడు..? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.
కనకపుర (ప్రస్తుతం రామనగర జిల్లా)లోని కనకపుర తాలుకాలోని దోడ్డ అలహళ్లి గ్రామానికి చెందిన కెంపేగౌడ-గౌరమ్మ దంపతులకు 15 మే, 1962న పెద్ద కొడుకుగా జన్మించాడు డీకే శివకుమార్. పాఠశాల చదువు ముగిసిన తర్వాత డిగ్రీ కోసం బెంగళూర్ వచ్చారు ఆయన. ముక్తా యూనివర్సీటీలో పొలిటికల్ సైన్స్ చదివారు ఆయన. ఆ సమయంలోనే కంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐలో చేరి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు.
1985లో అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నియోజకవర్గం నుంచి దేవేగౌడ మీద పోటీ చేసిన డీకే శివకుమార్ ఓడిపోయారు. అయితే అంత పెద్ద నేతకు గట్టి పోటీ ఇవ్వడంతో డీకే శివకుమార్ పేరు నలు దిశలా వ్యాపించింది. 1987లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బెంగళూర్ గ్రామీణ జిల్లా పంచాయతీ సభ్యుడిగా విజయం సాధించారు.
1989లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై సాతనూరు నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆయన. 1991లో అప్పటి కర్ణాటక సీఎం వీరేంద్ర పాటిల్ అనార్యోగం కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన వారసుడిగా బంగారప్ప వచ్చారు. ఆ సమయంలో బంగారప్పకు మద్దతుగా ఎమ్మెల్యేలను కూడగట్టడంలో డీకే శివకుమార్ మేజర్ రోల్ పోషించారు.
డీకే చేసిన సాయంను దృష్టిలో ఉంచుకొని బంగారప్ప ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. ఆయన మొదటి సారి మంత్రి పదవి వహించింది జైళ్ల శాఖకు.
అయితే 1994లో డీకేకు టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో సాతనూరు చేయి జారీ పోతుందని భావించిన డీకే స్వతంత్ర అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో డీకే 1999 నుండి 2002 వరకు పట్టాణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో సాతనూరు నుంచి డీకే నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోవడంతో డీకే శివకుమార్ సైలెంట్ గా ఉండిపోయారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో డీకే ఎమ్మెల్యే అయ్యారు. అయినా అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిద్దరామయ్య సీఎం అయ్యారు. ఆయన ప్రభుత్వంలో కూడా డీకే శివకుమార్ విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కుమారస్వామి మంత్రివర్గంలో డీకే నీటి పారుదల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2019లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో బీజేపీ అధికారంలోకి వచ్చి యాడ్యూరప్ప సీఎం అయ్యడు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంను కాపాడుకునేందుకు ఆనయ చేసిన ఒంటరి ప్రయత్నం ఫలించలేదు.
2023 ఎన్నికల్లో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని సీఎం రేసులో నిలబడ్డారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన డీకే హైకమాండ్ కే చుక్కలు చూపించే స్థాయికి ఎదిగారు.