Rushikonda : రుషికొండపై కొంతకాలంగా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, జనసేనతో పాటు ప్రజాసంఘాలు రుషికొండపై జరుగుతున్న తవ్వకాల విషయంలో ఆందోళనలు చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో అధికారంలోని వైసీపీ మాత్రం ఎలాంటి వివరాలు బయటకు పొక్కనివ్వడం లేదు. అసలు రుషికొండపై ఏం జరుగుతోంది. ఎందుకు ఇంతలా తవ్వకాలు అనే సంశయం నెలకొంది. గతంలో పచ్చ మ్యాట్ ను రుషికొండ చుట్టూ చుట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. నిజానికి అక్కడ ఏం జరుగుతుందనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియని ప్రశ్నలాగే మిగిలిపోయింది.
రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నట్లు గతంలో వైసీపీ ట్విట్టర్లో ప్రకటించింది. ఆ తర్వాత ఆ ట్వీట్ ను తొలగించింది. మరోసారి మంత్రి బొత్స మాత్రం అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నామని చెప్పారు. కానీ అధికారికంగా మాత్రం వెల్లడించడం లేదు. అయితే అత్యంత విలాసవంతమైన హోటల్ కడుతున్నారంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. దీనిపేరు మీదే అప్పు తెచ్చారని సమాచారం. అయితే పవన్ మాత్రం సర్క్యూట్ హౌస్ ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏం కడుతున్నారో మాత్రం ఇప్పటివరకు అంతు చిక్కడం లేదు.
అయితే ఇక్కడ నిర్మాణాలేవి హోటల్ రూపంలో లేవు. మొత్తంగా ఐదు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకటి ఇంద్రభవనంలా కనిపిస్తున్నది. మరొకటి చిన్న భవనాలు. కానీ ఇవి ఎందుకు ఇంత రహస్యంగా కడుతున్నారో ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రజల సొమ్ముతో కడుతున్న ఈ భవనాలు ఏంటో ప్రజలకు చెప్పకుండా దాటవేస్తున్నది. ఏపీలో ప్రభుత్వం ఇలానే ఎన్నో రహస్య జీవోలతో గతంలో విమర్శలపాలైంది. ఇప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తుంటే ప్రజలెవరూ హర్షించడం లేదు. అయినా వైసీపీ అదే తీరులో ప్రవర్తించడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. మరి ఎన్నికలకు ముందైనా ఆ భవనాల గురించి ఒక ప్రకటన చేస్తుందేమో వేచి చూడాలి.