Jagan Strategy : ఏపీలో అసలు ఏం జరుగుతుందో అధికార పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే మిగిలిన ఉన్న వేళ ఏకంగా ప్రతిపక్ష పార్టీ అధినేత, 14 ఏండ్లు ముఖ్యమంత్రిని అరెస్టు చేయించి, జగన్ తన ప్రతీకారం తీర్చుకున్నాడనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. అయితే ఈ సమయంలోనే ఎందుకు ఇంత దూకుడుగా వెళ్తున్నాడో తెలియక వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీలో మంచి ఆదరణ ఉంది. అతడి వయస్సు రీత్యా కూడా ఇంత వేధింపులకు దిగడం సబబు కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయినా సీఎం జగన్ తన దూకుడు శైలి తగ్గించుకోవడం లేదు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏంటని భయంలోకి వెళ్లిన వారు కూడా ఉన్నారు. చంద్రబాబు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఇక తమ పరిస్థితి అంతే అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక కొందరు నేతలు మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం చూపుతున్నారు. అయితే జగన్ మాత్రం తన వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. సమావేశంలో చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఆయన భావిస్తున్నారు. ఈలోగా అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండా చూసుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరినీ సస్పెండ్ చేస్తూ వెళ్తున్నారు.
మరోవైపు 12 రోజుల పాటు రిమాండ్ లో ఉన్న ఖైదీ అంటూ చంద్రబాబుపై విమర్శలు చేసే అవకాశం తమకు దక్కుతుందని వైసీపీ నేతలకు అధినేత చెబుతున్నట్లు సమాచారం. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేస్తే ఒకలా, పిటిషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరొకలా స్పందించాలని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే చంద్రబాబు అవినీతిలో పాల్గొన్నాడని కోర్టు నమ్మిందని చెప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక కోర్టు క్వాష్ పిటిషన్ కు అనుకూలంగా వ్యవహరిస్తే వ్యవస్థలను మేనేజ్ చేశాడని ప్రచారం చేయాలని చెప్పారని తెలుస్తున్నది.