BJP : బీజేపీ నుంచి గేటు దాటే వారి సంఖ్య పెరుగుతున్నది. పార్టీ కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పై అస్ర్త సన్యాసం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. అయితే ఈ చేరికలను ఆపేందుకు, అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీ రంగంలోకి దించిన రాష్ర్ట ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ శ్రమ ఫలించడం లేదు. ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్తున్నారు.
తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన ఉద్యమకారుల భంగపాటుకు గురవుతున్నారని అందులో పేర్కొన్నారు. పార్టీలో కష్టపడేవారికి ప్రోత్సహం లేదంటూ మండిపడ్డారు. అయితే మాజీ మంత్రి చంద్రశేఖర్ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన గతంలో ఐదు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు.
అయితే ఇప్పుడు చంద్రశేఖర్ తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు తెలుస్తున్నది. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలు అదే దారిలో ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ అధ్యక్షుడి మార్పు, ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించడం సహా కొన్ని పరిణామాల నేపథ్యంలో వారంతా పార్టీలోనే కొనసాగుతారని భావించినా, అలా జరగలేదు. ఎవరిదారు వారు చూసుకుంటున్నారు. అధికార బీఆర్ఎస్ పై పోరు చేసే పార్టలోనే ఉంటామని కొందరు చెబుతున్నారు. అయితే వీరిని పార్టీ గేటు దాటకుండా మాత్రం బీజేపీ రాష్ర్ట నేతలు చేయలేకపోతున్నారు. బుజ్జగించినా వారెవరూ వినే పరిస్థితిలో లేరు. ఇక మరికొందరు నేతలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారని కూడా తెలుస్తున్నది. ఏదేమైనా ఎన్నికల సమయంలో బీజేపీ తన పుట్టిని తానే ముంచుకుంటున్నట్లు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ దూకుడు తగ్గించి సెల్ఫ్ గోల్ కొట్టుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటో మరో మూడు నెలల్లో తేలిపోనుంది.