Kantara 2 : చిన్న సినిమాలు పెద్ద హిట్ కావడం సహజమే. లో బడ్జెట్ తో చేసిన సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలను తలదన్నేలా ఉండటం చూస్తుంటాం. ఈ కోవలో వచ్చిన కన్నడ సినిమా కాంతార ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. పెద్ద సినిమాలనే ఢీకొట్టి కలెక్షన్లు కొల్లగొట్టింది. దీనికి కారణం రిషబ్ శెట్టినే. తానే నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతార. కన్నడంలో మంచి హిట్ అందుకుంది.
కన్నడంతో పాటు ఇతర భాషల్లో కూడా కాంతార డబ్ చేయడంతో అక్కడ కూడా కలెక్షన్ల పర్వం కొనసాగించింది. ఇదే ఊపులో కాంతార 2 తీసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమవుతోంది. ఈ మేరకు రిషబ్ శెట్టి కథను సిద్ధం చేసుకున్నాడు. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లి సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడు. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో హీరో గుర్రం మీద కనిపించనుండటంతో ఈ మేరకు శిక్షణ తీసుకుంటున్నాడు. కాంతార 2ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. కాంతారను లో బడ్జెట్ లో నిర్మించినా కాంతార 2 మాత్రం భారీ వ్యయంతో నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కేజీఎఫ్ లాగా కాంతార కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైంది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసింది. దీంతో చిన్న చిత్రాల నిర్మాణంలో చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. కాంతార 2 కూడా అదే రేంజ్ లో ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తానికి కాంతార 2 ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.