Director Surender Reddy : టాలీవుడ్ లో దర్శకుల పరిస్థితి బాగా లేదు. సినిమా హిట్ అయితే అవకాశాలు వస్తాయి. ఫట్ అయితే ఎవరు ముందుకు రారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది. అతనొక్కడే సినిమాతో తెరంగేట్రం చేసిన ఇతడు తరువాత కిక్, రేసుగుర్రం, ధ్రువ వంటి హిట్లు అందుకున్నాడు.
ఊసరవెళ్లి, అతిథి, కిక్ 2, సైరా నరసింహా రెడ్డి చిత్రాలు కూడా తీశాడు. స్టార్ హీరోలకు మంచి బ్రేక్ ఇచ్చినా చిన్న హీరోలకు మాత్రం హిట్ ఇవ్వలేకపోతున్నాడు. దీంతో సురేందర్ రెడ్డి తరువాత సినిమా ఏమై ఉంటుందనే ఆలోచన అందరిలో వస్తోంది. అఖిల్ తో ఏజెంట్ తీసినా అది కూడా ప్లాఫ్ గా మిగిలింది. దీంతో ప్రస్తుతం సురేందర్ రెడ్డి భవితవ్యం గందరగోళంలో పడింది.
వివి వినాయక్ పరిస్థితి కూడా అంతే. ఆది సినిమాతో పరిచయమైన ఇతడు చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల ద్వారా తన ప్రతిభ చూపించాడు. కానీ ఇటీవల కాలంలో సినిమాలు లేక చేతులు కట్టుకుని కూర్చుంటున్నాడు. మరి కొందరు దర్శకులు తేజ, శ్రీను వైట్ల తదితరులు అదే కోవలో ఉన్నారు.
ఇప్పుడు సురేందర్ రెడ్డి తరువాత సినిమా వైష్ణవ్ తేజ్ తో ఉంటుందని చెబుతున్నారు. కానీ దానిపై క్లారిటీ లేదు. ఒక్క సినిమా డిజాస్టర్ అయితే ఇక ఆ దర్శకుడి పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే సినిమాల పరంగా ప్లాపులు ఉండకూడదు. హిట్లు ఉంటేనే వారికి భవిష్యత్ బాగుంటుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి పరిస్థితి ఎటు వైపు దారి తీస్తుందో తెలియడం లేదు.