
Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం. జీవిత కాలం కలిసుండేది భార్యాభర్తలే. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కన్నా బతికున్నంత కాలం ఒకరికొకరు తోడుగా ఉండాల్సింది భార్యాభర్తలే. మిగతా బంధాల కన్నా ఎక్కువ కలహాలు వచ్చేది కూడా భార్యాభర్తలకే కావడం గమనార్హం. కొందరు వీటిని అర్థం చేసుకుని తమ భాగస్వాములు చేసిన తప్పులను క్షమించి హాయిగా కాపురాలు చేసుకుంటారు. కానీ కొందరు నువ్వెంత అంటే నువ్వెంత..అంటూ సుఖమయ జీవితాన్ని రాద్ధాంతం చేసుకుంటారు. అర్థంతరంగా బంధాన్ని వదిలేసుకుంటారు. లేదంటే నిత్యం గొడవలతో ఇంటిని రచ్చ రచ్చ చేసుకుంటారు.
పండంటి దాంపత్య జీవనాన్ని కొనసాగించడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. జీవిత కాలంలో కాపురంలో ఎన్నో సమస్యలూ వస్తుంటాయి. వాటిని నేర్పుగా పరిష్కరించుకుంటూ వెళ్తేనే జీవితం హాయిగా సాగుతుంది. కుటుంబంలో కలహాలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచింది. ఈ జాగ్రత్తలు మగవారికి ఎక్కువగా ఉపయోగపడుతాయి. కుటుంబంలో గొడవలు రాకుండా మగవారు ఈ జాగ్రత్తలను పాటిస్తే వారి దాంపత్యం ఆనందంగా సాగుతుందనడంలో సందేహం లేదు.
తమ వారి గురించి చెడుగా చెప్పొద్దు:
ప్రతీ భర్త పెళ్లయిన కొత్తలో తన భార్యకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెబుతుంటారు. భార్య ముందు హీరోగా చిత్రీకరించుకోవడానికి తన తల్లిదండ్రులు, సోదరీసోదరుల గురించి చెడుగా చెబుతుంటారు. ఇవి మొదట్లో బాగానే ఉన్నా.. కాపురం పాత పడే కొద్ది అత్త, మామలతో భర్త సోదరీ, సోదరులతో ఎడం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తుల వివాదాలు, ఇగోలు గట్రా రావొచ్చు. ఈ నేపథ్యంలో మీరు గతంలో మీ వాళ్ల గురించి చెప్పిన చెడు విషయాలే ఆమెకు ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఆమె మిమ్మల్ని దెప్పిపొడవడం వంటి చేయవచ్చు. ఇది కుటుంబంలో కలహాలకు దారి తీయవచ్చు.
ఆరోగ్య సమస్యలు దాచొద్దు:
కొందరికీ చిన్ననాటి నుంచే ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. వీటిని పెళ్లి చేసుకునే ముందే ముందస్తుగా మీ జీవిత భాగస్వామికి చెప్పాలి. వారు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ అనారోగ్య విషయాలు దాచి తనను మోసం చేశారని ఆమె మీపై మండిపడవచ్చు. ఈ విషయాలు ఇంట్లో నిత్యం సంఘర్షణకు దారితీయవచ్చు.
తప్పును నిజాయితీగా ఒప్పుకోవాలి:
తెలిసో, తెలియకో ఏదైనా తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవాలి. లేదా అ తప్పును మీ భార్య వద్ద దాచేస్తే జీవితాంతం మీలో ఆత్మన్యూనత ఏర్పడవచ్చు. ఆ తప్పు మీ భార్యకు ఇతరుల ద్వారా తెలిస్తే చిన్న విషయం కూడా పెద్దగా కావొచ్చు. అందుకే తప్పును నిజాయితీగా ఒప్పుకుంటే మీ మీద ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడవచ్చు. మీరు ఆమెకు ఇచ్చే ప్రాధాన్యంతో ఆమె మిమ్మల్ని మరింతగా అభిమానించవచ్చు.
గతంలో చేసిన తప్పులు:
గతంలో మీరు ఉద్దేశ పూర్వకంగా చేసిన తప్పులను మీ భార్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. మీ భార్య మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటుందా? లేదా? ఆమె మానసిక పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసుకుని మాత్రమే చెప్పాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. ఆమెది విపరీత ధోరణి అయితే మాత్రం మీ తప్పులు చెప్పకుంటేనే మంచిది. ఒకవేళ చెబితే అర్థం చేసుకుంటుంది.. పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది అనుకుంటేనే చెప్పాలి.
పాత ఎఫైర్ల గురించి చెప్పొద్దు:
కొందరు భార్యతో తాము వయస్సులో ఉన్నప్పటి విషయాలను గొప్పగా చెప్పుకుంటారు. తాను ఎంతో మంది అమ్మాయిలను పటాయించినట్టు, ఎంతో మంది లవర్స్ ను మెయింటెన్ చేసినట్టు తమ గురించి తాము ఏదో పెద్ద ఘనకార్యం చేసినవాడుగా చెప్పుకుంటారు. ఇలాంటి విషయాలు ఎప్పుడూ కుటుంబ కలహాలకు దారితీసేవే. ఏ ఆడది అయినా తన భర్త రాముడిలా ఉండాలని భావిస్తుంది తప్పా.. తన భర్త ఇతరులతో సాన్నిహిత్యాన్ని కోరుకోదు. ఇది తెలియక తాము ఏదో హీరో అని ఫీలవుతూ పాత విషయాలను తోడుతూ భవిష్యత్ ను అంధకారం చేసుకుంటారు.






