
ఏపీ లో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి వైసీపీకి అసంతృప్తిల సెగ తగులుతూనేవుంది.దీంతో వైసీపీ లో అసంతృప్తి ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం వైసీపీ లో పెను దూమారమే లేపింది. సొంత జిల్లాలో తనకు ప్రాధాన్యం ఇవ్వని వైసీపీకి తన బలం ఏంటో చూపించాలనుకున్నారా..? లేక తన అనుచరులతో కలిసి వేరు కుపంటి పెడతారా.. ఒంగోలులో చూపిన తన బల ప్రదర్శన దేనికి సంకేతం..అనే సందేహాలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి..
వైసిపి ఆవిర్భావం నుంచి బాలినేని పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. అయితే బాలినేని సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని.. కార్యకర్తలకు న్యాయం చేయలేని పదవి తనకు ఎందుకు అని సీఎం జగన్ ఇచ్చిన వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి గత నెల 29న రాజీనామా చేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి, సెల్ ఫోన్ కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్ చేయించినా స్పందించకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగి తాడేపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్ కు రప్పించి సమావేశం ఏర్పాటుచేసి కారణాలు తెలుసుకొని బుజ్జగించినప్పటికీ బాలినేని తీవ్ర అసంతృప్తితో సమావేశం మధ్యలోనే లేచి హైదరాబాద్ కు వెళ్లిపోయారు.
రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఒంగోలుకు వచ్చిన బాల్నేనికి వైసీపీ శ్రేణులు ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద ఘన స్వాగతం పలికారు. కానీ ఎక్కడ వైసిపి జెండా గాని పార్టీ కండువా గాని కనిపించలేదు. దీంతో పలువురు అయోమయానికి గురయ్యారు. బాలినేని ముందే తన అనుచరులకు చెప్పి తన బల ప్రదర్శనను చూపించాలని ఇలా చేశారా.. లేక వేరే పార్టీలోకి వెళ్తారా..అని పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీంతో వైసిపిలో రాజకీయ దుమారం రేగుతోంది.
* బాలినేని తీవ్ర అసంతృప్తి..
వైసీపీ కోసం ఎంతో శ్రమించానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, అలాంటి తను పార్టీ మారుతున్నాడని, భూ కబ్జాలు చేస్తున్నాడని, లేనిపోని నిందలు,ఆరోపణలు చేస్తూ సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శిస్తున్నారని బాలినేని మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుంటా.. అని తనను విమర్శించిన వైసిపి నేతలకు సవాల్ విసిరారు. గోనె ప్రకాష్ తో కొందరు కావాలనే విమర్శలు చేపిస్తున్నారన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని బాలినేని కంటతడి పెట్టుకున్నారు.
* బాలినేని పయనం ఎటువైపు…
వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని టిడిపిలోకి వెళ్తారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. మరోపక్క జనసేనతో బాలినేని టచ్ లో ఉన్నారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా ఇటీవల జనసేన ప్రకాశం జిల్లా నేతలు కూడా బాలినేని వస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పారని సమాచారం. ఈ వార్తలన్నీ కలకలం రేపుతున్న సమయంలోనే బాలినేని ట్రైన్ లో ఒంగోలు కి వచ్చిన తర్వాత ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికి బల ప్రదర్శన చూపడం మరింత సంచలనంగా మారింది. ఏదేమైనా. ఎంత బుజ్జగించిన అలకమానని బాలినేని వైసిపి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..






