![Harirama Jogaiah's letter to Pawan Kalyan?](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/harirama-jogaiah-letter-to-jpg.webp)
Harirama Jogaiah : ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడు చిక్కులు వస్తున్నాయి. కాపు కులస్తుడిగా వారికి అభయం ఇస్తున్న పవన్ కల్యాణ్ కు ప్రముఖ కాపు సంఘం నేత చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. అధికార మార్పిడి అంటే జగన్ ను దింపి చంద్రబాబును సీఎం చేయడం కాదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారం చూస్తే జనసేనకు 65 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది. జనాభాలో తక్కువ శాతం ఉన్న రెడ్డి, కమ్మ కులస్తులే రాజకీయం చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం రావడం లేదు. ఇతరులకు రాజకీయ అధికారమే రావడం లేదు. దీంతో అందరు నైరాశ్యంలో ఉన్నారు. కాపులకు అధికారం దక్కితే మంచిదే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అధికారం దక్కడం అంత సులభమేమీ కాదని తెలుసుకోవాలి.
ఆరు శాతం రెడ్లు, నాలుగు శాతం ఉన్న కమ్మలే రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 40 శాతం ఉన్న మన వర్గాలకు రానివ్వడం లేదు. పవన్ కల్యాణ్ రాజకీయ చరిత్రను మారుస్తానని చెబుతున్నా అది సాధ్యం కాదని తెలుస్తోంది. రెండున్నరేళ్లు పవన్, రెండున్నరేళ్లు చంద్రబాబు సీఎంలుగా ఉంటారా అని ప్రశ్నించారు. దీంతో ఏపీలో జరుగుతున్న పరిణామాల వల్ల రాజకీయాలు ఎటు వైపు తిరుగుతాయో తెలియడం లేదు.
రాష్ట్రంలో 25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు బీసీ కులస్తులుగా ప్రాధాన్యం దక్కడం లేదు. విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దీంతో యాచించే స్థితి నుంచి శాసించే వరకు రావాలంటే రాజ్యాధికారం తప్పదు. కానీ అది మన సొంతం కావడం లేదు. ఈనేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని పోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. హరిరామ జోగయ్య రాసిన లేఖతో పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే అనుమానాలు వస్తున్నాయి.