Human Washing Machine : జపాన్‌లోని సైన్స్ కో అనే కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను ఆవిష్కరించింది. స్నానం చేయడానికి బద్ధకించే వారికోసం ఈ పరికరాన్ని తయారు చేసింది. దీనిని ఉపయోగించి మనం కష్టపడకుండానే 15 నిమిషాల్లో స్నానం చేసేయొచ్చని పేర్కొంది.
జపాన్ లోని ఒసాకాలోని కన్సాయి ఎక్స్‌పోలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను ఉంచిన సైన్స్ కో కంపెనీ దీనినిట్రై చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మిషన్ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎక్స్‌పోను చూసేందుకు వచ్చిన వెయ్యి మంది ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించి స్నానం చేసేలా సైన్స్ కో కంపెనీ ఏర్పాట్లు చేసింది.
ఈ ఎక్స్‌పో ముగిసిన తర్వాత వారిని ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. వీటి ఆధారంగా భారీ సంఖ్యలో ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్లను తయారు చేయనున్నట్లు సైన్స్ కో కంపెనీ వెల్లడించింది.
హూమన్ వాషింగ్ మిషన్ ప్రత్యేకతలు..
ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ చూడటానికి ఫైటర్‌జెట్ కాక్‌పిట్ ఆకారంలో ఉంది. బయటినుంచి చూస్తే లోపల ఉన్న వ్యక్తులు కనిపించేలా ప్లాస్టిక్‌తో తయారు చేశారు. దీనిలోకి ఒక వ్యక్తి వెళ్లి దాన్ని ఆన్ చేసిన తర్వాత.. సగానికిపైగా వేడినీరును నింపుకుంటుంది. ఆ తర్వాత అందులో ఏర్పాటు చేసిన హైస్పీడ్ జెట్స్ నుంచి నీరు షవర్ల మాదిరిగా చిమ్ముతుంటాయి. ఇక ఆ నీటిలో 3 మైక్రోమీటర్ల సైజులో ఉండే చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడుతాయి. ఈ నీటి బుడగలు.. మనిషి శరీరంపై ఉండే మురికిని సులువుగా తొలగించేందుకు ఉపయోగపడతాయి.
ఈ వాషింగ్ మెషీన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో పనిచేస్తూ ఉంటుంది. ఇది మనిషి శరీరానికి సంబంధించిన సమాచారం మొత్తం సేకరించి.. అందులో ఉన్న వ్యక్తిని మూడ్ ఎలా ఉందో తెలుసుకుని.. వారిని ఉత్సాహంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఏఐ ద్వారా ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉన్నాడా లేక నీరసంగా ఉన్నాడా అనేది అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఉండే వీడియోను ఆ వాషింగ్ మెషీన్‌లో ప్లే చేస్తుంది.
కాగా దీనిని 50 ఏళ్ల క్రితం చేసిన డిజైన్ ఆధారంగా తయారు చేశారు. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పోలో అప్పటి శానియో ఎలక్ట్రిక్ కో.. పానసోనిక్ కంపెనీ తొలిసారి తయారుచేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాత డిజైన్ ఆధారంగా కొత్త వెర్షన్‌తో ఈ లేటెస్ట్ హ్యూమన్ వాషింగ్ మెషీన్లను తయారు చేసినట్లు సైన్స్ కో కంపెనీ పేర్కొంది.