Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఇటీవల అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. అటు తర్వాత పార్టీ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తంది. ఈ భేటీలోనైనా కేబినెట్ విస్తరణ ఓ కొలిక్కి వస్తుందా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎప్పటి నుంచో అదిగో కేబినెట్ విస్తరణ.. ఇదిగో కేబినెట్ విస్తరణ.. అంటూ అధిష్టానం సంకేతాలు ఇస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అని ఓసారి, రేవంత్ విదేశీ పర్యటన ముగిసిన తర్వాతే అని మరోసారి.. ఇలా హైకమాండ్ విస్తరణ మీద లీకులు ఇస్తూ వాయిదా వేస్తూ పోతోంది. తను కోరిన నేతలకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని రేవంత్ పట్టుబడుతుంటే.. సీనియర్లు మాత్రం ఇతరుల పేర్లను సిఫార్స్ చేస్తుండడంతోనే మంత్రివర్గ విస్తరణ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత కేబినెట్ లో అతికొద్ది మంది మాత్రం రేవంత్ కు అండగా ఉంటున్నారు. సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే ఒకరిద్దరు మినహా మంత్రులు ఎవరూ పెద్దగా మాట్లాతిప్పికొట్టేందుకు ముందుకు రావడం లేదు. రైతు రుణమాఫీ , హైడ్రా.. ఇలా విషయం ఏదైనా బీఆర్ఎస్ , బీజేపీ నేతలు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అయినా మంత్రివర్గం నుంచి ఆశించిన స్థాయిలో రేవంత్ కు మద్దతు లభించడం లేదని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణలో తనకు అనుకూలంగా ఉండే నేతలకు చోటు కల్పించాలని అధిష్టానాన్ని రేవంత్ కోరుతున్నారు. దీనికి సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఇటీవల జమ్మూ – కశ్మీర్ ఎన్నికలపై అధిష్టానం దృష్టి పెట్టడంతో కేబినెట్ విస్తరణపై ఫోకస్ చేయలేకపోయింది. ఇక, ఎన్నికలు ముగుస్తుండటంతో ఈ విషయంలో నాన్చివేతకు ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చేసింది.
నేడు మంత్రివర్గ విస్తరణ అంశంతో పాటు,హైడ్రా, మూసి నది ప్రక్షాళన వంటి విషయాల పైన సమగ్రంగా చర్చించనున్నారు. ఈ దసరా లోపు మంత్రివర్గాన్ని విస్తరించి… పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు. ఈ మేరకు ఆరు మంత్రి పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ తో పాటు, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 12 మంది కొలువు తీరారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా ఒకేసారి భర్తీ చేసి పూర్తిగా పాలన పైనే దృష్టి సారించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన కొద్ది రోజుల్లోనే ఢిల్లీకి రానున్నారు. ఆయన వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు క్యాబినెట్ విస్తరణ పై చర్చించనున్నట్లు సమాచారం. ఆశావాహల సంఖ్య పెరుగుతుండడం, మంత్రి పదవుల విషయమై తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో, ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయం పైన ప్రస్తుతం మల్లికార్జున ఖర్గేతో పాటు , మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలతోనూ రేవంత్ చర్చించుకున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా అందరికీ న్యాయం చేసే విధంగా రేవంత్ మంత్రివర్గాన్ని విస్తరించ ఆలోచనలో ఉన్నారని సమాచారం.