- షాక్ కొట్టి యువకుడు మృతి

Charging the phone : ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా షాక్ కొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా యువతలో మార్పు రావడం లేదు. ఫోన్ చార్జింగ్ సమయంలో కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు చెబుతున్నా తలకెక్కించుకోవడంలేదు. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయమే మరిచిపోతున్నారు. ఫోన్లో మాట్లాడుతూ తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. దీంతో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఏపీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. యువకుడి కుటుంబంలో తీరని దు:ఖాన్ని మిగిల్చింది.
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సీపట్నంకు చెందిన కే లక్ష్మణ్(25) తన ఫోన్ నుచార్జింగ్ పెట్టాడు. ఇంతలోనే ఫోన్ రింగ్ కావడంతో, కాల్ మాట్లాడడం మొదలుపెట్టాడు, చార్జింగ్ తీయకుండా ఫోన్ మాట్లాడడంతో ఒక్క సారిగా షాక్ కొట్టింది. కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అయితే దవాఖానకు చేరుకునేలోగా మార్గమధ్యంలోనే లక్ష్మణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతూ షాక్ కొట్టి మృతి చెందిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినా నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. చిన్నపాటి పొరపాటుతో ప్రాణాలు పోతున్నా పట్టడం లేదు. ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడొద్దని టెక్ నిపుణులు పదే పదే కోరుతున్నారు. ప్రాణాలు విలువైనవని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.