KCR :
దేశంలో రాజకీయ సమరం ఇప్పుడు రెండు కూటముల మధ్యకు మారింది. ఒకటి అధికార ఎన్డీఏ.. రెండోది ప్రతిపక్షాల ఇండియా కూటమి.. ప్రస్తుతం రెండు కూటములుగా బలంగానే కనిపిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కు పెద్ద దిక్కుగా ఒక్క నరేంద్ర మోదీ కనిపిస్తుంటే, ప్రతిపక్షాల కూటమిలో ఆయనను ఢీకొట్టేలా మహామహులు కనిపిస్తున్నారు. అయితే ఈసారి రెండు కూటముల సమరంలో విజేతలెవరనేది ప్రజలే తేల్చనున్నారు. సర్వేలు మాత్రం మరోసారి అధికార ఎన్డీఏ పక్షాన నిలుస్తుండగా, మరి ప్రజల వరకు వచ్చేసరికి వారి నాడి ఏంటనేది సార్వత్రిక ఎన్నికల సమయానికి తేలనుంది.
ఇదంతా బాగానే ఉన్నా అయితే ఈ రెండు కూటముల్లో లేని పార్టీ అధినేత ఒకరు ఉన్నారు. ఆయనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రెండు కూటముల్లో లేకున్నా వారు కనీసం ఎన్డీఏ లో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ రెండింటినీ పక్కనపెట్టేశారు. రాష్ర్టంలో మేమే ప్రత్యామ్నాయం అంటూ గతంలో పెద్ద పెద్ద మాటలనే మాట్లాడారు. ఇప్పుడు మాత్రం ప్రగతిభవన్ టూ మహారాష్ర్ట టూర్లు మాత్రం చేస్తున్నారు. వరదలతో పలు జిల్లాలు అల్లాడుతుంటే ఆయన మహారాష్ర్ట టూరుకు వెళ్లడం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయినా అవేమి లెక్కచేయకుండా ఆయన మహారాష్ర్టలో అడుగు పెట్టారు.
అయితే కేసీఆర్ తానే కూటమి పెట్టాలని తొలుత అనుకున్నారు. ఇప్పుడు ఆయనతో కలిసివచ్చేందుకు ఏ ఒక్కరూ మిగలలేదు. అయితే తమతో కలిసి వచ్చే మిత్రులతో ముందుకెళ్తామని పదే పదే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా ఆయనతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్, కుమారస్వామి.. ఇలా ఎవరు కూడా ఆయన తో నడిచేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ అధినేత జగన్ కు కేసీఆర్ తో సఖ్యత ఉన్నా, ఆయన ఇప్పుడు బీజేపీ గ్రౌండ్ లో ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయినట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాల కూటమిలో కీలక కాంగ్రెస్ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైతే ఆయనను చేరదీసేలా కనిపించడం లేదు. ఇక బీజేపీ కి కేసీఆర్ గురించి పూర్తిస్థాయిలో లేదు. తనకు అవసరముంటేనే ఆయనను దగ్గరకు తీసుకుంటుంది. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్ ఎవరివైపు నిలబడతారో వేచి చూడాలి.