
Ashish Vidyarthi second wife : స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రూపాలీ బరూవాను పెళ్లాడాడు. ఇరు కుటుంబ సభ్యులు, కొందరు అతిథుల మధ్య రిజిస్ట్రార్ వివాహం చేసుకున్నాడు. ఆయన పెళ్లి విషయాలపై కొన్ని మాటలు చెప్పారు. రూపాలి తన జీవితంలోకి రావడం అద్భుతమంటూ పొగిడాడు. అయితే తన పెళ్లి వేడుకలకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు ఈ వధూ వరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపు 20 సంవత్సరాల క్రితం నటి శాకుంతల బరూవా కూతురు రాజోషిని వివాహం చేసుకున్నాడు ఆశిష్ విద్యార్థి. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇద్దరి మధ్యా పడక, పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్న ఆశిష్ విద్యార్థి రూపాలిని ఇష్టపడ్డాడు. దీనికి ముందు వీరిద్దరూ ఫ్రెండ్స్ గా ఉండేవారు. వీరి స్నేహంతో ప్రేమ చిగురించి పెళ్లి వరకూ దారి తీసింది. ఫ్యాషన్ డిజైనర్ అయిన రూపాలికి కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్ లో భాగస్వామ్యం ఉందని సమాచారం.
ఆశిష్ విద్యార్థిది ఢిల్లీలో పుట్టారు. 1991లో ‘కాల్ సంధ్య’ సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు ఆయన. ‘పాపే నా ప్రాణం’ సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత చాలా చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశారు. ‘గుడుంబా శంకర్’ సినిమాలో విలన్ బ్యాక్ డ్రాప్ లో కమెడియన్ గా నటిస్తూ మెప్పించారు ఆశిష్. అతిథి, తులసి, లక్ష్యం, పోకిరీ, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు.
ఇటీవల విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీలో హీరో తండ్రిగా సెన్సిటివ్ పాత్రలో మెప్పించారు ఆయన. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో ఆయన లీడ్ రోల్ చేశారు. ఇందులో ఆయన యాస ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడ, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ సినిమాల్లోనూ ఆయన నటించారు. 1995 కెరీర్ ప్రారంభంలోనే ఆయన జాతీయ అవార్డ్ అందుకున్నారు.