Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి 24) ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో టీడీపీ-జనసేన పొత్తులో కీలక ఘట్టం ముగిసింది. జనసేనకు 24 ఎమ్మెల్యే టికెట్లు, 3 ఎంపీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారని, దాని కోసం ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే ఇచ్చిన కేటగిరీలో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బట్టి జనసేన మద్దతుదారులు సీట్ల పంపకంపై అసంతృప్తితో ఉన్నట్లు అర్థం అవుతుంది. ‘కూటమిలో జనసేనకు 40కి తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు రావాలి. ఈ సంఖ్యను చేరుకోకపోతే కూటమి ప్రధాన ఉద్దేశమైన ఓట్ల బదలాయింపు జరగదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మెజారిటీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల అభిప్రాయం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా ముందు ప్రెజెంట్ చేస్తున్నా’ అని బోలిశెట్టి చెప్పారు. సత్యనారాయణ ఒక మీడియా సమావేశంలో ఈ మేరకు తను వ్యాఖ్యలు చేశారు.
ఎక్కువ సీట్లు రావడం ముఖ్యం కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా మూకుమ్మడిగా కూటిమికే బదలాయిస్తే సంప్రదాయ ఓటు బ్యాంకు కలుపుకొని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చు. ఈ ప్రధాన ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటనలో 40 ఎమ్మెల్యే టికెట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి జనసేన మరిన్ని సీట్ల కోసం ఒత్తిడిని తెస్తుందా? ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడితే దీని గురించి తెలుస్తుంది.