
Who is Sai Varshit: అమెరికా అంటేనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే దేశం. ఇక్కడ గన్ కల్చర్ కామనే అయినా ఇప్పటి వరకు అది ఆ దేశంలో పుట్టిన సంతతికే పరిమితం . కానీ ఒక్కసారిగా ఇండియాతో పాటు తెలుగు ప్రజలంతా ఉలిక్కిపడేలా చేశాడో యువకుడు.. ఏకంగా అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు వైట్ హౌస్ పైనే దాడి చేశాడు.. అగ్రరాజ్యం ఉలిక్కి పడేలా చేశాడు. ఇప్పుడు ఈ తెలుగువాడిపైనే అక్కడ చర్చంతా.. ఇంతకీ ఎవరీ సాయి వర్షిత్.. ఎందుకంత కోపం… ఇంత కటువుగా ఎందుకు మారాడు.. ఈ కుట్రకు కారణమేంటి.. అని అంతా ఆరా తీస్తున్నారు..
అమెరికాలోని మిస్సోరి చెస్ట్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన కందుల సాయి వర్షిత్ కు 19 ఏండ్లు. వారి కుటుంబం చాలా ఏండ్ల క్రితమే ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. అక్కడే స్థిరపడ్డారు. 2022లో మార్ క్విట్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. టెక్నాలజీపై మంచి పట్టు ఉంది. ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంగ్వేజ్ పై పట్టు ఉండడంతో డేటా అనలిస్ట్ గా స్థిరపడాలని భావించాడు. అయితే ఇక్కడి వరకు అంతా భాగానే ఉన్నా, సాయి వర్షిత్ ఒక్కసారిగా వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడిచేశాడు. అనంతరం పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతడు చెప్పిన విషయాలతో అక్కడి పోలీసులు కంగుతిన్నారు.
ఇంతకీ ఏం చెప్పాడంటే.. వైట్ హౌస్ ను స్వాధీనం చేసుకొని. అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఈ ఘటనకు ప్లాన్ చేశానని తెలిపారు. సుమారు 6 నెలలుగా ఈ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పాడు. అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్ ను చంపడమే తన లక్ష్యమని పోలీసుల ముందు వెల్లడించాడు. అయితే వర్షిత్ వద్ద నాజీ ల జెండా లభించింది. దీనిని ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తాను హిట్లర్ అభిమానినని , నాజీలకు గొప్ప చరిత్ర ఉందని తెలిపాడు. అయితే అతడి మాటలను బట్టి మానసికంగా బాధపడుతున్నట్లు గుర్తించారు. ఏదేమైనా అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ, నిత్యం డేగకళ్లతో పహారా కాసే హై సేఫ్టీ ప్రాంతం, యుద్ధవిమానాలు, రాడర్లు కూడా చేరుకోలేని ఆ భవనంపై దాడికి ఒక తెలుగు వాడు ఇంత సాహసం చేయడం విస్మయానికి గురి చేస్తున్నది. తన లక్ష్యం పూర్తి స్థాయిలో చెప్పకపోయినప్పటికీ, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని, లేదంటే మానసికంగా ఏదో ఇబ్బంది ఉంటుందని అంతా భావిస్తున్నారు.