
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనట్లే కనిపిస్తు్న్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు ఎవరికివారు 2024లో పీఠం మాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ గెలుపు కోసం బీఆర్ఎస్ తహతహలాడుతుంంటే, దీటైన ప్రత్యర్థి తానేనని కాంగ్రెస్ కాలు దువ్వుతున్నది. ఇక హిందూత్వ కార్డును నమ్ముకొని బీజేపీ పోటీకి సిద్ధమవుతున్నది. అయితే పోటీ ఏకపక్షమా.. ద్విముఖ పోరా.. త్రిముఖమా.. అనేది త్వరలోనే తేలనుంది. ఎన్నికలకు మరో 5 నెలల గడువే మిగిలి ఉండగా ఆయా పార్టీలు పోలిటికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. గెలుపు నీదా.. నాదా సై అంటున్నాయి..
అధికార బీఆర్ఎస్ చడిచప్పుడు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. అధినేత కేసీఆర్ ఇటీవలే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరనేతలు, క్యాబినెట్ తో వరుస భేటీలు పూర్తి చేశారు. మరోవైపు ఎన్నికల వేళ ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. దీనికి తోడు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న ఆయన అటు మహారాష్ర్ట, ఏపీలలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు. రాజకీయ చతురత మెండుగా ఉన్న సీఎం కేసీఆర్ కు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఒక లెక్క పక్కాగా ఉన్నట్లు తెలుస్తున్నది ఇంటలిజెన్స్, పీకే టీమ్ లు ఇప్పటికే ఆయనకు నియోజకవర్గాల వారీగా రిపోర్టు ను అందించాయి. ఆ దిశగా అధినేత కేసీఆర్ సైలెంట్ తన గ్రౌండ్ వర్క్ ను కానిచేస్తున్నారు. ప్రతిపక్షాల ఊసెత్తకుండా ప్రజల్లోకి ఆయన తన టీంను పంపించేస్తున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ లో ఆశావాహులు ఎక్కువ ఉండడమే ఇక్కడ కొంత నష్టం కలిగించే అంశం. దీనిని ఆ పార్టీ ఎలా ఢీల్ చేస్తుందో చూడాలి.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే జంబో నాయకత్వం ఉన్న పార్టీ. తెలంగాణలో ప్రస్తుతం నంబర్ 2 పార్టీగా వినిపిస్తున్నది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కొంత బలాన్ని పుంజుకున్నా, అంతర్గత కలహాలే తీరని చేటు చేస్తున్నాయి. ఎన్నికల వరకు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అంతా కలిసి సాగుతే ఫలితం ఉండే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. బీజేపీలో ఉన్న నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని లీకులు ఇస్తున్నది. ఈటల, కొండా సహా పలువరు నేతలను నేరుగానే ఆహ్వానిస్తున్నది. మరోవైపు పొంగులేటి, జూపల్లి చేరికలకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని చెబుతన్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గట్టి పోటీ ఉంటుందని టాక్ వినిపిస్తున్నది.
ఇక బీజేపీ ఈ రన్ లో కొంత స్లో గా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆ పార్టీకి మెజార్టీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి లేరు. మరోవైపు పార్టీలో లుకలుకలు సరేసరి. అయితే ఈ పార్టీల నేతలు కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. కేసీఆర్ పనైపోయిందని, కవితక్క అరెస్ట్ కాబోతున్నదని లీక్లు ఇస్తూ హంగామా చేస్తున్నారు. మరోవైపు రేవంతే తమ పార్టీలో చేరాలని కొండా విశ్వేశ్వరెడ్డి తాజాగా వ్యాఖ్యలు చేశారు. అయితే యువతలో కొంత పట్టు నిలుపుకుంటున్న బీజేపీ మాత్రం ఇప్పటివరకు ప్రజల మనసులను మాత్రం ఆ స్థాయిలో గెలుచుకోలేకపోతున్నది. ఇక ఈ మూడు పార్టీ మైండ్ గేమ్ లో నాయకులు చిక్కుతారా.. ప్రజలే వారి వలలో పడుతారా అనేది మరో ఐదు నెలల్లో తేలనుంది.