BJP Seats : గెలుపే లక్ష్యంగా టీడీపీ+జనసేన బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని భీష్మించుకున్నాయి. ఈ నేపథ్యలో ఈ రోజు (ఫిబ్రవరి 24) ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశాయి. బాబు, పవన్ కలిసి ప్రకటించిన ఈ జాబితాలో 118 సీట్లు ప్రకటిస్తారని ముందుగా చెప్పినా చివరికి 99 మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో టీడీపీ 94, జనసేన 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 19 చోట్ల జనసేనకు ఖరారు కావాల్సి ఉంది. 118 సీట్లు పూర్తయ్యాక మిగిలిన 57 సీట్లలో బీజేపీకి కూడా కొన్ని వెళ్లాల్సి ఉంది (ఒక వేళ బీజేపీ కలిసి వస్తే).
వచ్చే వారం బీజేపీతో పొత్తు విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు వారు అడుగుతున్న సీట్లను పక్కన బెట్టినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ, జనసేన చెప్పిన ప్రకారం.. బీజేపీ కనీసం 10 నుంచి 20 సీట్లు కోరుతోంది. అయితే, 15 సీట్ల వరకూ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 15 సీట్లలో బీజేపీ గెలిచేవి ఎన్ని? అనే ప్రశ్న కూడా వస్తుంది. బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం అంతిమంగా ఏ వైసీపీని ఓడించేందుకు వీరు కూటమి కట్టారో ఆ పార్టీకే మేలయ్యేలా కనిపిస్తోంది.
57 సీట్లలో బీజేపీకి 15 కేటాయిస్తే మరో 42 మిగులుతాయి. వీటిలో చాలా మటుకు కీలకమైన స్థానాలే. బీజేపీకి నికరంగా ఓటు బ్యాంకు ఉన్న స్ధానాలు ఒకటీ అరా తప్ప ఏవీ లేవు. 10 సీట్లకు పైగా బీజేపీకి కేటాయిస్తే తిరిగి వైసీపీకే గెలుపు బాటలు పడతాయి. ఇప్పటికే టీడీపీ+జనసేన మధ్య ఓట్ల బదలాయింపు ఎలా ఉంటుందో అనేది గ్యారంటీ లేదు. అలాంటి స్థితిలో బీజేపీకి రెండు పార్టీల ఓట్లు పడడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకే మేలు జరుగుతుంది.