గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే
అసెంబ్లీ నియోజకవర్గం: ఆళ్లగడ్డ
వైసీపీ: గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి
టీడీపీ: భూమా అఖిల ప్రియ
Allagadda Constituency Review : ఆళ్లగడ్డ నియోజవకవర్గం నంద్యాలలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో ఒకటి. ఒకప్పుడు ఫ్యాక్షన్ కు అడ్డగా ఉండే ఆళ్లగడ్డ రాను రాను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుతూ వస్తోంది. ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఇక్కడ భూమా వర్సెస్ గంగుల మాత్రమే ఉంటుంది. 1962 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గానికి 17 సార్లు (బై పోల్‌తో కలిపి) ఎన్నికలు జరిగాయి. పార్టీలు కాకుండా కుటుంబాలుగా ఇక్కడ రాజకీయం నడుస్తోంది.
నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. 1. ఆళ్లగడ్డ, 2. ఉయ్యాలవాడ, 3. చాగలమర్రి, 4. దొర్నిపాడు, 5. రుద్రవరం, 6. శిరివెళ్లి. ఇక ఓటర్ల సంఖ్య తీసుకుంటే (2019) 2,20,642 మంది ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నేత గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి (నాని) ఉన్నారు.
గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (వైసీపీ)
భూమా కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆళ్లగడ్డలో 2019లో గంగుల గెలుపొందారు. గంగుల కుటుంబం నుంచి మొదటి సారిగా నాని ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియపై విజయం సాధించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా గంగులకు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన సెగ తాకుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి పై ప్రజలు పెదవి విరుస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో చేసిన డెవలప్ మెంట్ తప్పితే పెద్దగా చేసింది లేదంటూ కొందరు బాహాటంగానే చెప్తున్నారు. కానీ బ్రిజేంద్రనాథ్ మాత్రం కావాల్సినంత డెవలప్ మెంట్ చేశానని చెప్పుకస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి కూడా తన గెలుపు నల్లేరుపై నడకే అంటున్నా.. నియోజకర్గంలో మాత్రం ఫైట్ టైట్ గానే కనిపిస్తుంది.
భూమా అఖిల ప్రియ (టీడీపీ)
గత ఎన్నికల్లో భారీ మెజార్టీతోనే ఓటమి పాలైన భూమా అఖిల ప్రియ ఈసారి రెట్టింపు మెజారిటీతో గెలుస్తానని ఘంటా పథంగా చెప్తోంది. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు నియోజకవర్గంలో బాగా పలుకుబడి ఉన్న నేతలు. వారి కూతురే భూమా అఖిల ప్రియ. తల్లిదండ్రులు ఇద్దరు కూడా నియోజకవర్గాన్ని ఏలినవారే కావడంతో తల్లి మరణానంతరం అఖిల ప్రియ రాజకీయంలోకి వచ్చారు. 2014లో మొదటి సారి అఖిల ప్రియ వైసీపీ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. టీడీపీ హయాంలో పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు.
భూమా కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గంలో అఖిల ప్రియ 2019లో ఓటమి పాలయ్యారు. కానీ ప్రస్తుతం యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఈ సారి కూడా ఆమెకే సీటు రావడం ఖయాంగా కనిపిస్తుంది. దీంతో ఫైట్ టైట్ గానే కనిపిస్తుంది. గతంలో గంగుల కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న ప్రజలు ఈ సారి భూమా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని టాక్ వినిపిస్తోంది.
భూమా వర్సెస్ గంగులలో 2024 ఎన్నికలు అత్యంత టఫ్ గా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భూమా కుటుంబానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం 2019లో గంగుల కుటుంబంలోకి వెళ్లింది. తిరిగి దక్కించుకునేందుకు అఖిల ప్రియ పావులు కదుపుతుండడంతో ఈ సారి పోరు రసవత్తరంగానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.