Choppadandi Assembly Review :
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అసమ్మతి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్వే ఆధారంగా టికెట్లు కేటాయిస్తుందని గులాబీ బాస్ ఇప్పటికే స్పష్టం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భయం నెలకొంది. దీంతో సుంకె రవిశంకర్ కు భయం పట్టుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇప్పుడు నియోజకవర్గమంతా పర్యటిస్తున్నారు.
కరీంనగర్ కు చెందిన ఓ కార్పొరేటర్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా టికెట్ వేటలో పైరవీలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో చొప్పదండిలో పరిస్థితులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీ గురించి పట్టించుకోకపోవడంతోనే వ్యతిరేకత పెరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. తన వద్ద అనుచరులుగా ఉన్న ఓ అగ్రకుల నేత కాంట్రాక్టర్ గా ఉన్నాడు. అతడికి సంబంధించిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పించకపోవడంతో అతడి వ్యతిరేక బావుటా ఎగరేశారు. దీంతో ఎమ్మెల్యే భవితవ్యం సందిగ్ధంలో పడింది. ఇప్పుడు నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది పరిస్థితి.
ఇప్పటికే సుంకె రవిశంకర్ భవిష్యత్ అంధకారంలో పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆది నుంచి ఆయన నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచిందని అంటున్నారు. పార్టీ నేతలను పట్టించుకోకపోవడంతో ఆయనకు సీటుగండం ఏర్పడినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల అమలులో కూడా అతడి తీరు మరోలా ఉందని వార్తలు వస్తున్నాయి.
చొప్పదండి నియోజకవర్గ పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడానికే నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే టికెట్ వ్యవహారం ఇప్పుడు అందరిలో నానుతోంది. రవిశంకర్ కు టికెట్ నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియడం లేదు.
చొప్పదండి నియోజకవర్గానికి నాయకులు అచ్చి రావడం లేదు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బొడిగె శోభకు గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో సుంకె రవిశంకర్ కు అవకాశం దక్కింది. ఇప్పుడు అదే సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో చొప్పదండి నియోజకవర్గానికి కుదరడం లేదు. ఒకసారి ఉన్న వారు మరోసారి ఉండటం లేదు. సుంకె రవిశంకర్ పరిస్థితి కూడా అలాగే డోలాయమానంలో పడినట్లు తెలుస్తోంది.