గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరు
అసెంబ్లీ నియోజకవర్గం: రాప్తాడు
వైసీపీ: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
టీడీపీ: పరిటాల సునీత
Raptadu Constituency Review: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల్లోని 7 అసెంబ్లీ స్థానల్లో ‘రాప్తాడు’ ఒకటి. 2008 డీలిమిటేషన్ లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇందులో 1. ఆత్మకూర్, 2. రాప్తాడు, 3. కనగానపల్లి, 4. సీకేపల్లి మరియు రామగిరి మండలాలు, 5. అనంతపురంలోని కొంత భాగం ఉన్నాయి. ఇక మొత్తం ఒటర్లు 2,45,435 మంది ఉన్నారు.
ఈ నియోజకవర్గం మొదటి నుంచి పరిటాల కుటుంబానికి అడ్డాగా ఉంది. పరిటాల అంటే రాప్తాడు.. రాప్తాడు అంటే పరిటాల అన్నట్లుగా ఉండేది. పరిటాల రవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన హవా కొనసాగుతోంది. పరిటాల రవికే కాకుండా ఆయన కుటుంబానికి ఈ నియోజకవర్గంలో భారీగా కేడర్ ఉంది. పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబానికే విధేయులుగా పని చేస్తారు. దీనిలో భాగంగానే 2009, 2014 రెండు దఫాలుగా పరిటాల సునీత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గెలిచినా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ పరిశీలిద్దాం.
వైసీపీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
రాప్తాడులో పార్టీ ఏదైనా పరిటాలదే పవర్ అన్న మాటలను చెరిపేశాడు తోపుదుర్తి. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆయన అనేక పరిటాల కుటుంబంపై రాజకీయంగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. రెండు సార్లు ప్రజలు ఛాన్స్ ఇవ్వకున్నా.. వైసీపీ పార్టీ అండదండలతో 2019లో విజయం దక్కించుకున్నాడు. తోపుదుర్తి ఫ్యామిలీ మొదట టీడీపీలో ఉండేదే.. పరిటాల ఫ్యామిలీకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండడంతో కాంగ్రెస్ లోకి వెళ్లినతోపుదుర్తి ఫ్యామిలీ ఆ తర్వాత వైసీపీలోకి వచ్చింది.
సుధీర్ఘంగా పరిటాల కుటుంబం ఫైట్ చేస్తున్న తోపుదుర్తి కుటుంబం ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. నియోజకవర్గంలో ఆయనకు ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఆయన సోదరుల తీరుతో పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో పార్టీలోని చాలా మంది కీలక నేతలు ప్రకాశ్ రెడ్డి తీరుపై పెదవి విరుస్తున్నారు. ఇక అభివృద్ధి విషయంలోనూ ప్రజలు పెదవి విరుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వలస కూలీలు పెరిగారని, కావాలసినంత పంట భూమి ఉన్నా, నీరు ఉన్నా వలసలను ఎమ్మెల్యే ఆపలేకపోతున్నారని నియోజకవర్గం వ్యాప్తంగా టాక్ ఉంది. నియోజకవర్గంపై పట్టున్న ఫ్యామిలీని వెనక్కు నెట్టిన ఖాతాలో ఈ సారి కూడా టికెట్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికే ఇస్తారని తెలుస్తున్నా.. గెలుపు మాత్రం మరింత టఫ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
టీడీపీ పరిటాల సునీత
ఏది ఏమైనా ఈ నియోజకవర్గం మాత్రం పరిటాల కుటుంబానిదే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో పెనుకొండ నియోజకవర్గంలో రాప్తాడు ఉండేది. 1994 మొదలు కొని 2004 వరకు పరిటాల రవి ఏక ఛత్రాదిపత్యంగా పాలించాడు. ఆయన హత్య అనంతరం వచ్చిన బైపోల్ లో ఆయన భార్య పరిటాల సునీత ఎన్నికల్లో నిలుచుంది. అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. ఆ తర్వాత రాప్తాడు ఏర్పడడంతో పరిటాల ఫ్యామిలీ ఇటువైపునకు మళ్లింది. 2009, 2014లో రెండు సార్లు గెలుపొందిన పరిటాల సునీత ఒక దఫా మంత్రిగా కూడా పని చేశారు. అయితే 2019లో తన కొడుకు పరిటాల శ్రీరాంను బరిలోకి దించగా భారీ మెజార్టీతోనే ఓటమి పాలయ్యాడు. దీంతో సుదీర్ఘ పాలనకు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.
అయితే వచ్చే 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి మళ్లీ పరిటాల సునీత పోటీలోకి దిగుతారని స్పష్టంగా తెలుస్తోంది. ఐదేళ్లు వైసీపీ ఉన్నా.. పరిటాల ఫ్యామిలీకి ఉన్న పట్టు మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని టాక్ వినిపిస్తుంది. రెండు దఫాలుగా ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పని చేసింది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయం 2005లో ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది. ఈ క్రెడిట్ కూడా ఆమె ఖాతాలోనే వేసుకుంది. పరిటాల వారసుడిగా తన కొడుకును బరిలోకి దించాలని అనుకున్న ఆమె తప్పు చేసిందన్న వాదనలు వినిపించాయి. 1994 నుంచి మొదటి సారి నియోజకవర్గంలో ఆమె కుటుంబం ఓటమి పాలయ్యింది. అయితే ఈ సారి మళ్లీ పరిటాల సునీతనే బరిలో నిలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఆమె నిలుచుంటే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి గెలుపు మరింత కష్టంగా మారవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
2019లో ఓటమి తర్వాత సునీత కొడుకు పరిటాల శ్రీరాంను ధర్మవరం ఇన్ చార్జిగా నియమించాడు చంద్రబాబు. ఈ సారి అక్కడ కొడుకు, ఇక్కడ తల్లి గెలుపు ఖాయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ధర్మవరంలో సరైన ప్రత్యర్థి లేకపోవడంతో గెలుపు నల్లేరుపై నడకే అయినా.. ఆమె తల్లికి రాప్తాడులో మాత్రం ఫైట్ తప్పదన్న వాదనలు లేకపోలేదు.