Maharashtra CM : మహారాష్ట్ర ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ గా కొనసాగుతాయని మొదట్లో పొలిటికల్ అనలటిస్ట్ లు అంచనాలు వేశారు. కానీ ప్రచారంలో మాత్రం ఏక పక్షమేనని తేలిపోయింది. మహాయుతి, మహా అఘాడి రెండు కూటముల పోరాటంలో మహాయుతి ఘన విజయం సాధించింది. 288 సీట్లకు 235 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో ప్రధాన పార్టీ అయిన బీజేపీ132 సీట్లు సాధించింది. అయితే పూర్తి స్థాయి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 145 కాగా.. దానికి బీజేపీ 13 సీట్ల దూరంలో ఉంది. ఈ సీట్లు బీజేపీ వైపునకు లాగడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇదంతా పక్కన ఉంచిన ఇప్పుడు మహా సీఎం ఎవరనేది చర్చ కొనసాగుతోంది. బీజేపీ నాయకుడు దేవంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని కొందరు అంటే.. షిండేనే మళ్లీ కొనసాగించాలని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో మహా పీఠంపై రసవత్తరమైన పోటీ కొనసాగుతోంది.
ఫడ్నవీస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా..?
ప్రస్తుతం సీఎం ఏక్‌నాథ్ షిండేనే కొంత కాలం సీఎంగా కొనసాగించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దవ్ కు చెందిన శివసేనను ఎదుర్కోవడంలో షిండే సిద్ధహస్తుడు కాబట్టి ఆయననే కొనసాగిస్తే మరికొంత మందిని బీజేపీ వైపునకు లాగవచ్చన్న చర్చ కూడా వినిపిస్తోంది. మరి దేవేంద్ర ఫడ్నవీస్ గురించి మాట్లాడితే.. ఫడ్నవీస్ ను జాతీయ రాజకీయాల్లోకి జేపీ నడ్డా స్థానంలో తీసుకెళ్లాలని కొందరు నేతలు పార్టీకి సూచనలు చేస్తున్నారు. సీఎం షిండే అని ఎన్నికలకు వెళ్లిన తర్వాత ఆయనను మార్చడం మంచిది కాదంటున్నారు. పార్టీకి కూడా భంగం కలిగే అవకాశం కలుగుతందని స్పష్టం చేస్తున్నారు. షిండే పథకాలు ప్రజల్లో ఆదరణ పొందాయని ఆయననే కొనసాగిస్తే బాగుంటుందని చెప్తున్నారు.
మూడు పార్టీల నిర్ణయం ఫైనల్..
కూటమి పార్టీల నిర్ణయంతో సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ‘మహారాష్ట్ర ప్రజలు మహాయుతిని నమ్మి అధికారం ఇచ్చారు. వారి తీర్పు సంతోషాన్ని ఇస్తుంది. సీఎం పదవిపై ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేవు. అందరం కలిసే నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావిస్తాం’ అని అన్నారు. 100కు పైగా సీట్లను సాధించామని చెప్పి కూటమి పార్టీలను వదులుకోబోమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే స్పష్టం చేశారు.
స్థిరమైన ప్రభుత్వాన్ని కావాలి
స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు ఎన్సీపీ నేత అజిత్ పవార్ అన్నారు. నవంబర్ 26 కంటే ముందే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఎం పదవికి అజిత్ పవార్ పేరు కూడా ప్రస్తావనకు వస్తున్నప్పటికీ దానికి ఎంతమాత్రం అవకాశం లేదని, డిప్యూటీ సీఎంగానే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలైన ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు దక్కించుకున్నాయి.
నేడు ప్రమాణ స్వీకారం
కొత్త ప్రభుత్వం ఈ రోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని శివసేన నాయకుడు దీపక్ కేసర్కర్ తెలిపారు. తొలి విడుతలో సీఎంతో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆ తర్వాత మిగతావి చూస్తామని పార్టీ నుంచి వినిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం సీఎం మినహా 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, శివసేన (షిండే) నుంచి 12, ఎన్సీపీ (అజిత్ పవార్) నుంచి 10 మందికి అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.