
Media in AP : మీడియా.. వ్యవస్థలో, సమాజంలో జరుగుతున్న విషయాన్ని పక్షపాత ధోరణి లేకుండా ఇవ్వడమే కాదు ప్రజలకు మంచి చేసే అంశాలను వారికి చేర్చే ఓ వేదిక.. మరి ఏపీ లో ప్రధాన మీడియా ఎటువైపు ఉంది..ప్రజల వైపు ఎవరున్నారు.. రెండు వర్గాలుగా విడిపోయి మీడియా పని చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇప్పటికైతే ఏపీ లో మీడియాను ఎల్లో మీడియా, నీలి మీడియా అంటూ సోషల్ మీడియా, రెండు ప్రధాన పార్టీల నేతలు సంబోధిస్తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీల కు అనుకూలంగా సదరు మీడియా యాజమాన్యాలు పనిచేయడమే ప్రధాన కారణం. ఈనాడు, ఈటీవీ, ఆంధ్ర జ్యోతి, ఏబీఎన్, టీవీ 5 , తదితర చానళ్లు ఎల్లో మీడియా గా పిలువబడుతున్నాయి.
మరికొన్ని చానళ్లు కూడా టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నా ఇంకా వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. ఇక సాక్షి మీడియా గ్రూపును నీలి మీడియా జాబితాలో చేర్చారు. అధికార పార్టీకి అనుబంధంగా, అనుకూలంగా ప్రస్తుతం ఈ చానల్, పేపర్ పని చేస్తున్నది. పార్టీ అధినేత, సీఎం జగన్ సొంత మీడియా సంస్థనే కావడంతో దానికి ఆ పేరు తప్పలేదు. అయితే ఇక్కడ తటస్థంగా కనిపించే రెండు చానళ్లు మాత్రం ప్రస్తుతం అధికార పార్టీ ఎడ్జ్ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది.
ఇటీవల చంద్రబాబు ఇంటి జప్తు అంశాన్ని ఢంకా బజాయించి చెప్పిన ఈ చానళ్లు నిన్న హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ అంశం వాదనల్లో జగన్ పేరు చేర్చిన విషయాన్ని మాత్రం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఈ రెండు చానళ్లు కూడా ఇప్పుడు నీలి మీడియా లోకి చేరాయని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరి పార్ఠీలు, వ్యక్తుల వారీగా మీడియా చీలిపోతే ప్రజల పక్షాన నిలిచేది ఎవరంటే చెప్పడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.