Sharmila Strategy :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా ఆమెను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. చివరికి పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ లో కలిపేయాలని సూచనలు చేసే పరిస్థితికి వచ్చింది. కర్ణాటకు వెళ్లిన ఆమె అక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కలిసి వచ్చారు. ఇక పార్టీని కాంగ్రెస్ లో కలుపడమే తరువాయి అన్నట్లుగా కథనాలు మొదలయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏపీకి ఆమెను అధ్యక్షురాలిగా పంపించాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తన ఆస్తులను పిల్లల పేరుపై రాయించింది. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మ, కొడుకు రాజారెడ్డి, కుమార్తె అంజలిరెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి విజయమ్మ ఇడుపులపాయ వెళ్లగా, శర్మ వెంకంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఆమె తన పేరు మీద ఉన్న ఇడుపులపాయలో 9.53 ఎకరాల భూమిని తన కుమారుడు రాజారెడ్డికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ద్వారా బదిలీ చేసింది. ఆ తర్వాత ఇడుపులపాయ ఎస్టేట్‌ను చూసుకునే వెంగమునిరెడ్డి నుంచి 2.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ భూమిని షర్మిల కుమార్తె పేరు మీద రిజిస్టర్ చేశారు.
షర్మిల పిల్లలకు హఠాత్తుగా భూములు రిజిస్ట్రేషన్ చేయడం కడప, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షర్మిలకు ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డితో కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయని, వారిద్దరి మధ్య ప్రస్తుతం మాటలు లేవని తెలిసింది. షర్మిల కావాలంటే ఏదో ఒక రోజు సైలెంట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ మీడియా దృష్టి వైఎస్‌ఆర్ కుటుంబంపై ఉన్న రోజునే (వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె ఎంచుకుంది. ఇలా బహిరంగంగా చేయడం ద్వారా షర్మిల కచ్చితంగా ఏదో ఒక ప్లాన్‌తో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇడుపులపాయలో షర్మిల, ఆమె పిల్లలు ప్రత్యేక విమానంలో ఎక్కుతున్న ఫొటోలను పంపి వైఎస్ఆర్టీపీ మీడియాను అప్రమత్తం చేసింది. ఇడుపులపాయలో జగన్ పర్యటనకు సంబంధించిన మీడియా పాస్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ విభాగం తిరస్కరించగా, షర్మిల పార్టీ వారు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. అలాగే, ఆమె పర్యటనను కవర్ చేయమని కోరుతూ వారు మీడియా హౌస్‌కి కాల్ చేశారు.