
Modi and Shah : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ రాష్ట్రానికి వరుస కట్టి వేళ్తారు బీజేపీ అగ్రనాయకులు. ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందే అగ్ర నాయకత్వం ఆయా రాష్ట్రాల్లో తిష్టివేసుకొని కూర్చుంటారు. 2014కు ముందు ఉన్న బీజేపీ కంటే ఇప్పుడు ఉన్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓటర్ల నాడీ పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మోడీ, షా ధ్వయం మరికొన్ని సంవత్సరాలు దేశాన్ని పాలిస్తాయని సర్వేలు చెప్తున్నా. రాష్ట్రాలను దక్కించుకోవడంలో ఎందుకో వెనుకబడుతున్నాయి.
అయితే, ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలకు వెళ్లే బీజేపీ అగ్రనాయత్వం, తెలంగాణకు రావాలంటే ఏవో ఆటంకాలు కలుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు అమిత్ షా రావాల్సి ఉండగా తుపాన్ కారణంగా ఆయన రాలేక పోయారు. ఇక ప్రధాని కూడా ఇటు వచ్చేందుకు ఎందుకో సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాల గురించి మధ్య ప్రదేశ్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలపై కొంచెం వేడిని పులిమారు ప్రధాని మోడీ.
ఇక, మోడీ, అమిత్ షా వచ్చే నెల (జూలై) రెండో వారంలో తెలంగాణకు వస్తారని బీజేపీ నాయకులు గంపెడు ఆశలతో ఉన్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని, రెండో వారంలో ఎప్పుడైనా ఉండచ్చని ఆశిస్తున్నారు. అయితే వరంగల్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభ తేదీని కూడా మోడీ పర్యటనకు అనుకూలంగా ఫిక్స్ చేయాలని తెలంగాణ నాయకత్వం భావిస్తుంది. ఆ బహిరంగ సభలో కూడా మోడీ మాట్లాడుతారని స్థానిక నేతలు ఆశగా ఉన్నారు.
ఇక ఎన్నికల్లో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను కూడా తెలంగాణకు తీసుకువస్తున్నారట. అయితే భోపాల్ లో మంగళవారం నిర్వహించిన ‘మేరా పోలింగ్ బూత్-సబ్ సే మజ్బూత్’లో పాల్గొన్న వీరు ఒక ప్రత్యేక రైలులో తెలంగాణకు వచ్చారు. వారు సికింద్రాబాద్, మంచిర్యాల, కాజీపేటల్లో ప్రచారం నిర్వహిస్తారు. దీంతో పాటు హైదరాబాద్ వేదికగా జూలై 8వ తేదీన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితో అయినా తెలంగాణలో ఊపు తెప్పించాలని బీజేపీ భావిస్తోంది.