MLC Kavitha : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి విడుదలై నెల రోజులైంది. ఆమె విడుదల కాగానే నాయకులు, కేడర్ జైలు బయట డప్పులు, బాణసంచాతో సంబురాలు చేసుకున్నారు.
తనను తాను పోరాట యోధురాలిగా ప్రకటించుకున్న కవిత తన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటామని, రాజకీయ కారణాలతోనే తనను జైలుకు పంపారని దేశం మొత్తానికి తెలుసన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు. పోరాడి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటాం అంటుంది. తాను మొండిదాన్నని, జైలు శిక్ష తనను దృఢంగా మార్చిందని పేర్కొన్నారు. నాకు ఇబ్బంది కలిగించిన వారిని వదిలిపెట్టేది లేదని చెప్పింది.
మరుసటి రోజు హైదరాబాద్ కు తిరిగి వచ్చిన కవిత ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె ప్రజల కంటికి కనిపించకుండా పోయింది. గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె బహిరంగంగా కనిపించడం లేదు. మీడియాతో మాట్లాడలేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆమె అన్న కేటీర్, బంధువు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న తరుణంలో కవిత రాజకీయ రంగానికి దూరంగా ఉండడం గమనార్హం. కొంత కాలంగా కేసీఆర్ కూడా కనిపించడం లేదు. తన ప్రత్యర్థులపై రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చట్ట పరమైన ఆంక్షలు లేనప్పటికీ- ఢిల్లీ మద్యం పాలసీ కేసు గురించి చర్చించకపోవడమే కాకుండా- ఆమె ఆకస్మిక మౌనం విస్మయం కలిగిస్తోంది.