KA Paul:
కేఏ పాల్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో మత ప్రభోధకుడిగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు కాని ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. తెలుగు రాష్ర్టాల్లో చక్రం తిప్పుతానంటూ తిరుగుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉంటున్నారు. తెలంగాణ, ఏపీలో నాయకులను తిట్టిపోస్తూ హడావిడి చేస్తున్నారు.
అయితే తాజాగా ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ తాను పక్కా లోకల్ అని చెప్పుకున్నారు. విశాఖలో తనకంటే మంచి అభ్యర్థి లేరని ఈసారి పోటీ చేసి తీరుతానని గట్టిగా చెప్పారు. ఇక నుంచి ఇక్కడే మకాం పెడతానని, తన రాజకీయం ఎలా ఉంటుందో ఇక్కడి రాజకీయ పార్టీలకు చెబుతానని సవాల్ విసిరారు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తుగా మారాయని మండిపడ్డారు. విశాఖపట్నం కి మేలు చేసే పార్టీ ఒక్కటీ కూడా లేదని, అందుకే తాను బరిలో దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే విశాఖ దగ్గర తగరపువలస తన సొంత ప్రాంతమని అందుకే ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంత సమస్యలు తీర్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడి పరిస్థితులు తనకంటే ఎక్కువగా తెలిసిన నాయకులు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో విశాఖ నుండి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తెలుగు రాష్ర్టాల్లో కేఏపాల్ చెప్పే మాటలు అందరినీ నవ్వల్లో ముంచుతుంటాయి. ప్రస్తుతం విశాఖలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. మరోవైపు ఈసారి బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షురాలు పురందేశ్వరిలో బరిలో నిలిచే చాన్స్ ఉంది. పొత్తు ఖరారైతే ఆమెకు సీటు ఖాయం, గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా బలంగానే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కేఏపాల్ ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తారా అంటే.. అనుమానంగానే కనిపిస్తున్నది. మరి కేఏపాల్ ఏం చేస్తారో ఎన్నికల వరకు వేచిచూడాలి.