Nara Lokesh Arrest : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల విషయలో పలుపార్టీల మద్దతు కూడగడుతున్నారు. అక్కడే ఉంటూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మాత్రం కలవడం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీలైన శివసేన, బీజేడీ, హర్యానా డిప్యూటీ సీఎం వంటి వారిని కలిశారు. వారు లోకేష్ కు సంఘీభావం తెలిపారు.
మరోవైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రణాళిక ప్రకారం బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో లోకేష్ అక్కడే ఉండి తన తండ్రిని ఎలా బయటకు తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయనిపుణులతో మాట్లాడుతూ తదుపరి చర్యలపై ఫోకస్ పెడుతున్నారు. జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వైసీపీ విధానాలను ఎండగడుతున్నారు.
చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని అడ్డుకుని బయటకు తీసుకురావాలని లోకేష్ శ్రమిస్తున్నారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది. దీనిపై తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెడీగా ఉన్నారు క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే ఏసీబీ కోర్టులో కూడా అనుకూల తీర్పు వస్తుందని అనుకోవడం లేదు.
ఏపీలో నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే వదంతులు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకుంటున్నాయి. నారా బ్రాహ్మణిని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ర్యాలీ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రాహ్మణి వస్తే యూత్ ఐకాన్ కావడం తప్పనిసరని చెబుతున్నారు.