Winning Border Loosing Home : సరిహద్దులో రాత్రనక, పగలనక దేశ రక్షణ కోసం కాపలా కాస్తుంటారు సైనికులు. దేశంలోని ప్రజలు ఏ భయం లేకుండా సుభిక్షంగా ఉంటున్నారంటే సైనికులే కారణం. ప్రాణాలను పణంగా పెట్టి వారు కాపలా కాస్తుండడం వల్లే దేశంలోని ఆర్థిక వ్యవస్థలు సాఫీగా పనులు చేసుకుంటూ ఉంటాయి. రక్షణ రంగం పటిష్ఠంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కుటుంబాలను వదిలేసుకుని దేశ ప్రజలే తమ కుటుంబంగా భావిస్తూ పనిచేసే సైనికులు రిటైర్ అయి తమ ఊరికొస్తే..చివరకు వారికి దక్కేది ఏంటి? వారికి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దేశ సేవకు సర్వం త్యాగం చేసిన ఆ సైనికులకు పాలకులు ఇస్తున్న విలువ ఏపాటిది?
దేశ సరిహద్దుల్లో విదేశీయులపై యుద్ధం చేసి గెలిచి..సొంతూరిలో మాత్రం ఓడిపోయానంటూ ఓ మాజీ సైనికుడి ఆవేదన ఇది. అతడి వ్యధ ఎవరికీ రావొద్దని ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూస్తే తెలుస్తుంది. సత్తిబుల్లి వెంకటరెడ్డి అనే మాజీ సైనికుడు 1962 చైనా యుద్ధంలో, 1965 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నానని, 40 ఏండ్ల కింద మిలటరీలో రిటైర్ అయిన తర్వాత తాడేపల్లి గూడెం ఎయిర్ పోర్ట్ భూముల వద్ద ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాలను సాగు చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని చెప్పారు.
ఇటీవల జాతీయ విద్యాసంస్థ నిట్ కడుతున్నారనే పేరుతో తనకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్దాక్షిణ్యంగా భూమిని లాక్కుని, ఇల్లు కూల్చివేశారని, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి న్యాయమంటూ మంత్రి వద్ద, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరుగలేదంటూ కలెక్టర్ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు.
ఇది మన ప్రభుత్వాల తీరు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం పాటుపడిన సైనికులకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? దేశం సుభిక్షంగా ఉంటేనే ఈ పాలకులు అధికారాన్ని అనుభవిస్తున్నారు. అదే సైనికులు చేతులెత్తేస్తే..తాము ఈ దేశాన్ని మేం రక్షించబోమంటూ ఆయుధాలు కిందపడేస్తే..ఈ పాలకులు పాలన చేయగలరా?