Xiaomi SU7: ముడి చమురు కొరత, డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాల ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాదాపు అన్ని వాహన కంపెనీలు ఈవీ వెహికిల్స్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా గ్జియోమీ ఎంఐ కంపెనీ ఈవీ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. దీని ఫీచర్స్ కారు కొనాలనుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కార్ల బుకింగ్ ను ఎంఐ ప్రారంభించిందని, ఈ వారం నుంచి ఆర్డర్లు తీసుకుంటుందని సమాచారం వచ్చింది. ఎంఐ మొదటి ఎలక్ట్రిక్ వాహనం ధర 5,00,000 యువాన్ల అంటే రూ. 59,59,630 కంటే తక్కువగా ఉంటుందని ఎంఐ సీఈఓ తెలిపారు. ఎంఐ కంపెనీ ఎస్‌యూ-7 కారు ధర అందరినీ ఆకర్షిస్తుందని కంపెనీ చెప్తోంది. ఈ కారు గురించి అధికారిక ప్రకటన కొద్ది సేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఈవెంట్ తర్వాత ఆర్డర్లు తీసుకునే అవకాశం ఉందని కంపెనీ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐ ఎస్‌యూ- 7 కారు ఫీచర్స్ తెలుసుకుందాం.
ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి ఆటోమేకర్లలో ఒకటిగా ఉండాలని ఎంఐ ఎస్‌యూ-7ను డిసెంబర్-2023లో కంపెనీ ఆవిష్కరించింది. టెస్లా, పోర్షేకు సంబంధించి ఈవీ కార్ల కంటే మెరుగైన సాంకేతికతను ఎస్‌యూ-7 కలిగి ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. డిసెంటర్ నుంచి ఎంఐ చైనాలోని ఎంఐ స్టోర్లలో ఈ కారును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇందులో ఓషన్ బ్లూ వెర్షన్ ఆకర్షిస్తుంది. ఈ కారు 2 వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. మొదటిది ఒకే చార్జితో 668 కిలో మీటర్ల (415 మైళ్లు) వరకు డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటుంది. రెండోది 800 కిలో మీటర్ల వరకు అందిస్తుంది.
దశాబ్దంగా ఈవీ కార్ల కోసం ఎంఐ 10 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. ఈ సంస్థ ఏడాదికి 2 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బీజింగ్‌లోని ఫ్యాక్టరీలో ప్రభుత్వ, యాజమాన్య వాహన తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ లో తయారు చేస్తున్నారు.