Chiranjeevi : సినిమాల్లో తెరమీద హీరోయిజం చూపించే మెగాస్టార్ చిరంజీవికి ఆఫ్ ద స్ర్కీన్ సౌమ్యుడిగా పేరుంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ప్రచార సమయంలోనూ, మిగతా సమయంలోనూ ఎవరినీ వ్యక్తిగతంగా వ్యవహరించలేదు. అప్పటి ప్రభుత్వ విధానాల మీద, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపారే తప్ప కక్ష్య పూరితంగా, అవమానించేలా వ్యాఖ్యలు చేయలేదు. హూందాగా వ్యవహరించారు. అసెంబ్లీలోనూ ఆలోచనాత్మక సూచనలు చేశారు తప్ప రాజకీయ మైలేజీ కోసం పాకులాడలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోంచి తప్పుకున్న చిరంజీవి పొలిటికల్ సర్కిల్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసినా నేరుగా ఎక్కడా మద్దతు తెలపలేదు. అలాగని వ్యతిరేకించలేదు.
సెలబ్రేషన్స్ లో చిరు వ్యాఖ్యల తో దుమారం..
అయితే నాలుగు రోజుల క్రితం వాల్తేరు వీరయ్య సెలబ్రేషన్స్ లో సినిమా ఇండస్ర్టీపై పెరుగతున్న ఒత్తిడిని చెప్పే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దూమారాన్ని రేపుతున్నాయి. కేవలం ఏపీ అధికార పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారనే కోణంలో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
వైరల్ అవుతున్న కొన్ని క్లిప్పలే..
‘రాజకీయ నాయకులతో పోల్చుకుంటే సినిమా ఎంతండీ.. చిన్నది. నేను అదీ చూశా.. ఇదీ చూశా సర్. మీలాంటి వాళ్లు పెద్ద పెద్ద విషయాల్లో జోక్యం చేసుకోవాలి. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు తదితర వాటిని ఇవ్వగలిగితే, దాని కోసం ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరం తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సర్’ అని అన్నారు. అప్పటికి పూర్తి వీడియో రాకపోవడంతో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే బయటకు వచ్చాయి. దాంతో, సోషల్ మీడియాలో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే వ్యాఖ్యలు మాత్రమే నెట్లో వైరల్ అయ్యాయి. కేవలం తమ ప్రభుత్వం పై బురదజల్లే ఉద్దేశంతోనే చిరంజీవి వ్యాఖ్యానించారంటూ ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు ప్రెస్‌మీట్లు పెడతూ చిరంజీవిపై మండిపడుతున్నారు. ఆ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన ఫుల్ వీడియో తాజాగా విడుదలైంది.
అసలు వ్యాఖ్యలు ఇవీ..
‘‘సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి పార్లమెంటులో మాట్లాడుతున్నారు. రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అన్నట్లుగా నటీనటలు, హీరోలను ఎత్తి చూపుతున్నారు. రెమ్యూనరేషన్ అంశం రాజ్యసభ వరకు తీసుకెళ్లొద్దని విజ్ఞప్తి. వ్యాపారం జరుగుతున్నది కాబట్టే సినిమాలు చేస్తున్నాం.. ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నది గనకే మాకు డబ్బులు ఇస్తున్నారు. సినిమాలు వస్తున్నాయి కాబట్టే చాలా మందికి ఉపాధి లభిస్తున్నది. దేశంలో సినీ పరిశ్రమ కంటే పెద్ద సమస్య ఇంకేదీ లేదన్నట్లు చూస్తున్నారు. పార్లమెంట్‌లో కూడా వీటిపై మాట్లాడుతుండడం దురదృష్టకరం. రాజకీయాలతో పోల్చుకుంటే సినిమా చాలా చిన్నది. సినిమాలను రాజకీయాలకు దూరంగా ఉంచండి. మా కష్టాలేవో మేం పడతాం. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నందునే ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెడుతున్నందునే ఆదాయం రావాలని కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి.. అణగదొక్కాలని చూడవద్దు’’ అని చిరంజీవి అన్నారు.
కానీ ఇందులోని కొన్ని క్లిప్పులను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సినీ ఇండస్ర్టీని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. అయితే ఏపీ అధికార పార్టీ నేతలు ఇలా సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించవద్దని కోరుతున్నారు.