ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గిస్తూ తెచ్చిన బిల్లుకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా విపక్షాల కూటమి పెట్టిన విశ్వస తీర్మానానికి కూడా తాము వ్యతిరేకంగామని బీజేపీకే తమ మద్దతుగా ఉంటామని మరోసారి స్పష్టం చేసింది. యూనిఫాం కోడ్ బిల్లు పెడితే కూడా దానికి వైసీపీ మద్దతు ఉంటుందని ముందుగానే స్పష్టం చేసింది. ఇలా బీజేపీ ఏది అడగకున్నా వైసీపీ ముందుకు వస్తూ.. మేము మీ వెంటే.. మీతోనే అని పదేపదే రాసుకు పూసుకు తిరుగుతున్నది..భారతీయ జనతా పార్టీకి ఏ విషయంలోనైనా తమ మద్దతునిస్తామని, అవి ప్రజా వ్యతిరేక విధానాలైనా సరే మద్దతుగా ఉంటామని చెప్పినట్లుగానే వైసీపీ ప్రవర్తన కనిపిస్తు్న్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో మినహా మరే సందర్భంలోనూ వైసీపీని కేంద్రం మద్దతు కోరలేదు. కానీ ప్రతి సందర్భంలోనూ వైసీపీ నే ఒక అడుగు ముందుకేసి తాము అనుకూలమని చెప్పుకుంటూ వస్తున్నది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలకు కూడా వైసీపీ మద్దతు తెలిపి విమర్శలపాలైంది. అదేవిధంగా ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలోనూ అదే తీరును కొనసాగించింది. ఇప్పుడు విపక్షాల కూటమి పెట్టిన అవిశ్వాసాన్ని కూడా వైసీపీ వ్యతిరేకిస్తున్నది. దీంతో బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆ పార్టీ చేస్తున్న పొర్లుదండాలు మాములుగా లేవంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీతో కలిసి తమ ప్రత్యర్థి పార్టీ జనసేన పోరుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఏపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి ఏపీ పర్యటన కు వచ్చిన అమిత్ షా, నడ్డాలు జగన్ సర్కారును అవినీతి ప్రభుత్వం అని విమర్శించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను అటు వైసీపీ బీజేపీకి పణంగా పెడుతున్నది. రాష్ట్రానికి చేకూరాల్సిన ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి మాత్రం అందరికంటే ముందు లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్నది. సీఎం జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసులు, చివరికి హత్య కేసులు మెడకు చుట్టుకోకుండా చేసుకునేందుకే ఇలా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఓట్లేసి గెలిపించిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ తీరు ఉన్నదనే విమర్శలు మాత్రం ఏపీలో వినిపిస్తున్నాయి.
ReplyForward
|