YCP : ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో యాత్రకు ప్రజలు, పవన్ అభిమానులు, జనసైనికులు బ్రహ్మరథం పడుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో పవన్ పర్యటన జనసేనకు ఇంతకుముందెన్నడూ లేనంతగా ఆదరణ తెస్తున్నది. దీంతో కాపులు జనసేన వైపు తిరుగుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ రంగంలోకి దిగింది.
కాపులను ఆకర్షించే పనిలో పడింది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు బడా నాయకులను వైసీపీలో చేరాలని కోరుతున్నది. నయానో.. భయానో వైసీపీలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో చేరని వారిని పాత కేసులతోనూ లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు సృష్టిస్తామని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కాపు సామాజిక వర్గంలో అత్యంత ఆదరణ తగ్గుతున్నది. గతంలో ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం వైపు మొగ్గు చూపినా, తాజాగా ఆయన జగన్ తో కలిసి పని చేసేందుకు ప్రయత్నిస్తుండడం కాపు సామాజిక వర్గానికి నచ్చడం లేదు. దీంతో కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నేతగా పవన్ ను చూస్తున్నారు.
రానున్న ఎన్నికలకు ముందే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా కాపులంతా తమ వైపే ఉన్నారని ప్రజలు అనుకోవాలని అధికార పార్టీ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు రంగంలోకి దిగారు. తమ పార్టీలోకి చేరాలని కాపు సామాజిక వర్గ వారిని కోరుతున్నారు. స్థానిక ప్రాంతాల్లో వారికి అనుకూలంగా చేసే పనులను వివరిస్తున్నారు. తద్వారా వారిని వైసీపీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. వైసీపీ ఆకర్ష్ పథకం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
ReplyForward
|